మహబూబాబాద్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ (BRS )కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా జిల్లాలోని ఉమ్మడి వెలికట్ట ఎంపీటీసీ పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నేత మంగళపెల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమావేశంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రధాన కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణపై ప్రధానంగా చర్చ జరిగింది.
గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతును మరింత పెంచేందుకు ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చేరవేయాలి అనే అంశాలపై శ్రీనివాస్ మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. అలాగే, గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో అమలైన పథకాలు, గ్రామాల్లో అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను గుర్తుచేయాలన్నారు.
ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి, ఏఏ గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు బీఆర్ఎస్ నేతలు కృషి చేయాలని నిర్ణయించారు. రోడ్లు, నీటి సమస్య, పింఛన్లు, పథకాలు లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ప్రతీప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.