Urea | నర్సింహులపేట డిసెంబర్ 27: కాళ్లు మొక్కుతా బాంచన్.. ఒక్క యూరియా బస్తా ఇప్పించండి.. అంటూ అధికారి కాళ్ల మీద పడి ఓ అన్నదాత వేడుకున్నాడు. యాసంగి సీజన్ మొదలైనప్పటికీ రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ఇలా ఓ రైతన్న కాళ్ల మీద పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
యూరియా బస్తాలు ఇస్తారనే సమాచారంతో పెద్ద నాగారం వద్ద గల నర్సింహులపేట రైతు వేదిక వద్ద రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. ఈ క్రమంలో కొంతమందికి యూరియా బస్తాలు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. ప్రైవేటు షాపుల్లో పురుగుల మందులు కొనడానికి లింకు పెడుతూ వారికి యూరియా బస్తా ఇవ్వలేదు. ఈ క్రమంలో అన్నదాతలు, వ్యవసాయ అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఏవో అక్కడి నుంచి వెళ్లబోయాడు. సూర్య అనే రైతు ఏవోను అడ్డుకుని యూరియా ఇవ్వాలని బతిమిలాడుకున్నాడు. మొక్కజొన్న సాగు చేసి నెలరోజులు గడుస్తున్నా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని.. దీంతో ప్రైవేటు షాపుల్లో యూరియా బస్తాలతో పాటు పురుగుల మందు కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి రెండు బస్తాలు ప్రైవేటులో కొనుగోలుచేశామని.. దానికి లింకు పెడుతూ యూరియా ఇవ్వమని తిరకాసు పెట్టడం భావ్యం కాదని ఏవో కాళ్ల మీదపడి ఆవేదన వ్యక్తం చేశారు.