తొరూరు : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి రైతులు, అధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత వరకు ధాన్యాన్ని వెంటనే తరలించాలని అధికారులకు సూచించారు. రైతులు ధాన్యాన్ని పూర్తి అరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తెచ్చి విక్రయించుకోవాలన్నారు. జిల్లాలో గత వరి ఒక లక్ష ఇరువై ఆరువేల మెట్రిక్ టన్నులు దిగుబడినివ్వగా, ప్రస్తుతం రెండింతలుగా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
బస్తా 40కేజీలతో కలిపి 650 గ్రాములు తూకం మాత్రమే తీసుకోవడం జరుగుతుందని రైతులకు వివరించారు. అంతకుముందు మండలంలోని హరిపిరాలలో 45ఎకరాల్లో 3షేడ్ నెట్లో ఏర్పాటు చేసిన నర్సరీలో 45000 ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశానుసారం హరిపిరాలలో నర్సరీ ఏర్పాటుకు 45 ఎకరాలు, గోపాలగిరిలో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు 75 ఎకరాలు కేటాయించడంలో అధికారులు చూపిన ప్రతిభను కొనియాడారు.
కార్యక్రమంలో ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, ఉద్యానశాఖ అధికారి సూర్యనారాయణ, తాసిల్దార్ వేంరెడ్డి రాఘవరెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింగరావు, సివిల్ సప్లై, జిల్లా మేనేజర్ మహేందర్, డీపీఎన్ నలిని, ఆయిల్‌ఫెడ్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా కో-ఆర్డినేటర్ సురేశ్, నర్సరీ అధికారి హరీశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.