న్యూశాయంపేట, మార్చి 19 : క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించడం ద్వారానే ఉన్నత స్థాయికి ఎదుగుతామని సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 123 ర్యాంకర్ అట్ల తరుణ్ తేజ తెలిపారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని శ్రీవ్యాస ఆవాసము పదమూడో వార్షికోత్సవ వేడుకలను సులక్ష్య సేవా సమితి వ్వవస్థాపక అధ్యక్షుడు మండువ సంతోష్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సివిల్స్ ర్యాంకర్ అట్ల తరుణ్‌తేజ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్ధుల్లో స్ఫూర్తినింపేలా మాట్లాడారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు ఆశ్రమం కల్పిస్తూ.. సంప్రదాయాలతో పాటు నాణ్యమైన విద్యను అందించడం, సమాజంలో అవసరం ఉన్న వారికి సులక్ష్య సేవా సమితి అందిస్తున్న సేవలు అభినందనీయమని తరుణ్ తేజ అన్నారు. సరిహద్దుల వద్ద భద్రత ఎంత ముఖ్యమో, దేశంలో అంతర్గత భద్రత అంత ముఖ్యమని వాయు సేన వారంట్ ఆఫీసర్ అనిల్‌కుమార్ త్రిపాఠి అన్నారు.

అనంతరం విద్యార్థులకు ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోరతో కుడిన విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాసర్ల వసుంధర, సాయికిరణ్, కోడం వినయ్, ప్రణీత్, రామాచారి తదితరులు పాల్గొన్నారు.