మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటుచేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు (Fire Accident) అంటుకున్నాయి. దీంతో అందులో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు వచ్చారు. అలాగే పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంతమంది కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మహబూబాబాద్ నుంచి ఫైర్ ఇంజిన్ రప్పించి మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.