తొర్రూరు : కాంగ్రెస్(Congress) పాలనలో నాయకులు సంబురాల్లో మునిగితేలుతుంటే.. రైతులు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగు, తాగు నీరు లేక అరిగోస పడుతున్నారు. నీళ్లు లేక కండ్లముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేని అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పండించిన పంటలు పొట్ట దశలో ఉండగా వాగుల్లో నీటి కొరత వల్ల పంటలు ఎండిపోతున్నాయని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమరపుకుంట తండా రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మడిపల్లి, సోమరపుకుంట తండా సమీపంలోని ఆకేరు వాగులో సుమారు 50 మంది రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.
దాదాపు 500 ఎకరాల వరి పంటలు పొట్ట దశలో ఉండగా వాగులో నీటి లేమి వల్ల పంటలు ఎండిపో తున్నాయని రైతులు వాపోయారు. చెక్‌డ్యామ్‌లు పూర్తిగా ఖాళీగా ఉండటం, వాటిలో నీరు నిల్వ లేకపోవడం రైతులను తీవ్రంగా కలిచివేస్తున్నది. గెలిపించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా పట్టించుకోవడం లేదు. చెక్‌డ్యామ్‌లలో నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. చివరికి వరుణ దేవుడైనా కరుణించి వర్షాన్ని ప్రసాదించు, అని రైతులు వరుణ దేవుడిని వేడుకుంటున్నారు. కార్యక్రమంలో బానోత్ శంకర్, భద్రమ్మ, కౌసల్య, శవాళి, ఝాన్సీ, బాలాజీ, కిశోర్, కుమార్, శారద, జగన్, జ్యోతి, బానోత్, సరిత, వసంత, శ్యామల, రవి, మంజుల, దేవి, కృష్ణ, మౌలాలి, రంగమ్మ, వెంకన్న, రెడ్యా, సత్తమ్మ, వాలి,దేవా, శారద, బాలాజీ, మంగ్లీ, తదితరులు పాల్గొన్నారు.