నర్సింహులపేట ఫిబ్రవరి 18 : మండలంలో సాగునీరు లేక(Irrigation water) రైతులు కష్టాలు పడుతు న్నారు. భారీ వర్షాలతో వానకాలం పంటలు నష్టపోయిన రైతన్నలకు సరైన పరిహారం అందేలేదు. దీనికి తోడు పంట పెట్టుబడికి పైసలు రాలేదు. కష్ట నష్టాలకు ఓర్చి పండించిన పంటలకు బోనస్ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆకేరు వాగు చెక్ డ్యాములు తెగిపోవడంతో చుక్కలేరు నిలిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొంతమంది రైతులు యాసంగి వరిసాగుకు వెనుకడుగు వేశారు. వానకాలం పంట కలిసి రాకపోవడంతో యాసంగి పంటైనా వేద్దామంటే రైతన్నకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
మండలంలోని జయపురం గ్రామానికి చెందిన వీరబోయిన మల్లయ్య అనే రైతు మూడు ఎకరాల వరిసాగు చేయగా ప్రస్తుతం పంటకు నీరు అందకపోవడంతో నీటి చెలిమెనే నమ్ముకున్నాడు. మోటర్ ఏర్పాటు చేసిన గుంతలోకి నీళ్లు వచ్చేలా కష్టపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో మే నెలలో సైతం చెక్ డ్యాం మత్తడి పోసేదని, ఇప్పుడు చుక్క నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం పంటలకు నీళ్లందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.