Amazon : అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) తమపై సైనిక చర్యకు దిగడానికి ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ (Iran) దాడులు చేస్తోంది. పశ్చిమాసియా దేశాల్లోని అమెజాన్ డేటా సెంటర్ల (Amazon Data Centers) పై కూడా దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇవాళ ధ్రువీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని తమ రెండు డేటా సెంటర్లపై డ్రోన్లు దాడి చేశాయని అమెజాన్ (Amazon) పేర్కొన్నది.
దాంతో పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్లు తెలిపింది. బహ్రెయిన్‌లోని డేటా సెంటర్ సమీపంలో జరిగిన దాడివల్ల మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఉద్యోగులు ఎవరైనా గాయపడ్డారా..? లేదా..? అనే విషయం గురించి సంస్థ స్పష్టం చేయలేదు. సర్వీసుల పునరుద్ధరణకు తమ సిబ్బంది స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పింది.
సర్వీసుల్లో అంతరాయం కారణంగా ప్రభావితమైన వినియోగదారులు కీలకమైన డేటాను బ్యాకప్ చేసుకుని, ఇతర ప్రాంతాల్లోని అమెజాన్ సర్వీసులకు మారాలని సూచించింది.