తొర్రూరు, ఆగస్టు 21: మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు అన్నారం రోడ్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయం ఎదుట యూరియా కోసం బారిన తీరారు. రైతులకు యూరియా పంపిణీలో భాగంగా ఎలాంటి జరగకుండా పోలీసులు ఉదయాన్నే తొర్రూరు పిఎసిఎస్ కు పదుల సంఖ్యలో చేరుకున్నారు. రైతులకు పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు బానోత్ వెంకన్న మాట్లాడుతూ గత పది రోజులుగా పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో తిరుగుతున్నా ఐదు కేజీల యూరియా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ యూరియా దొరకాలంటే 10 రోజులపాటు తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా యూరియాను దళారుల చేతికి వదిలేస్తూ వారికి ఒక్కొక్కరికి 10 నుంచి 20 బస్తాలు ఇవ్వగా, నిజమైన రైతులకు మాత్రం ఒకటి లేదా రెండు బస్తాలకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు పైరోలు చేసుకుంటూ విస్తృతంగా యూరియా సరఫరా జరుగుతుండగా, పేద రైతులు మాత్రం రోజులు తిరిగినా ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.