నర్సింహులపేట ఫిబ్రవరి 19 : యాసంగి వరినాటు వేసిన కానుంచి యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మండల వ్యాప్తంగా 22 గ్రామాల్లో బావులు, చెరువులు, వాగను నమ్ముకుని వరి పంట 5,215 ఎకరాలు, మొక్కజొన్న 8 వేల ఎకరాల్లో సాగు చేశారు. పంటలకు సరిపడా యూరియా(Urea shortage) అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి నాటు వేసి నెలరోజులైనా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల్లో లైన్లో ఉన్నవారికి కాకుండా పైరవీకారులకు పెద్ద ఎత్తున యూరియా బస్తాలు ఇస్తున్నారని సిబ్బందితో గొడవ దిగుతున్నారు.
గత కొన్ని రోజులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో యూరియా సక్రమంగా అందుబాటులో ఉండడం లేదని, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాలకు కలిపి 220 బస్తాల యూరియా వస్తే పంటలకు ఏ విధంగా సరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ అధికారుల వద్ద స్పష్టత లేదని, అధికారులు అడిగితే ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.