కురవి, ఫిబ్రవరి 25 : మహాశివరాత్రిని పురస్కరించుకొని జరిగే భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిశోర్(DSP Krishna Kishore) బందోబస్తు సిబ్బందికి సూచించారు. కురవి మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్లో జాతర బందోబస్తుపై డీఎస్పీ జీ. మోహన్‌తో కలిసి బందోబస్తు సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వీరభద్రస్వామి జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు.
జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు దర్శనం, వీఐపీ దర్శణం, కళ్యాణ ప్రాంగణం, పార్కింగ్ విషయాల వద్ద తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించి, పలు సూచనలు చేసారు. జాతరలో ముగ్గురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 28 ఎస్సైలు, 200 మంది సిబ్బంది పని చేస్తారన్నారు. వీరితో పాటు షీ టీంలు, దొంగతనాలు జరగకుండా క్రైమ్ పార్టీలు అందుబాటులో నిరంతరం పర్యవేక్షిస్తుంటాయని అన్నారు. జాతరలోని ముఖ్య కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతరకు హాజరయ్యే భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు సర్వయ్య, రాజేష్, రవి, దేవేందర్, కురవి, సీరోలు ఎస్సైలు గండ్రాతి సతీష్, సీహెచ్ నగేష్ పాల్గొన్నారు.