బయ్యారం : మార్కెట్ లైసెన్స్(Market license) లేకుండా వ్యాపారం నిర్వహిస్తే వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గ్రేడ్-3 సెక్రటరీ నరేష్ హెచ్చరించారు. బయ్యారం మండల కేంద్రంలోని మార్కెట్ చెక్ పోస్టును ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు తప్పకుండా మార్కెట్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా అక్రమ వ్యాపారాన్ని అరికట్టి ఇల్లందు మార్కెట్ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2024 25 ఏడాదికి సంబంధించి మార్కెట్ టార్గెట్ 4.64 కోట్లు కాగ ఇప్పటికే 3.80 కోట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మార్కెట్ పరిధిలోని బొమ్మనపల్లి, రోంపెడ్, ముచ్చర్ల, బయ్యారం చెక్ పోస్టులకు సంబంధించి ఏడాది 98.85 లక్షలు సెస్ వసూలు చేసినట్లు తెలిపారు. మార్చి వరకు టార్గెట్ పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం చెక్ పోస్ట్‌లో రికార్డులను పరిశీలించారు.