మరిపెడ : విత్తన, ఎరువు డీలర్లు నాసిరకం విత్తనాలతో రైతులను మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరిపెడ ఏడీఏ విజయచంద్ర హెచ్చరించారు. బుధవారం పురపాలక సంఘం పరిధిలోని స్థానిక భార్గవ ఫంక్షన్ హాల్లో మరిపెడ, తొర్రూర్, పెద్ద వంగర, దంతాలపల్లి, నరసింహుల పేట, చిన్న గూడూరు, కురవి, సిరోల్, డోర్నకల్ మండలాలకు చెందిన విత్తన ఎరువు డీలర్లకు నిర్వహించిన డివిజన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విత్తన ఎరువు డీలర్లు రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు ప్రతి రైతుకు కచ్చితంగా రసీదు ఇవ్వాలన్నారు.
రైతులకు ఇచ్చే రసీదులో విత్తనాలకు సంబంధించిన వివరాలన్నీ రాసి రైతు సంతకం తీసుకొని విత్తనాలు ఇవ్వాలని తెలిపారు. డీలర్లు విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుల మందులు సమగ్ర వివరాలను రిజిస్టర్లో రోజువారీగా నమోదు చేయాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో వివిధ మండలాల వ్యవసాయ అధికారులు వీరాసింగ్, వినయ్ కుమార్, వాహిని, మురళీమోహన్, భాస్కర్, నరసింహారావు, రామ నరసయ్య, స్వామి, ఛాయారాజ్, సాంకేతిక వ్యవసాయ అధికారులు శ్రీదేవి, విజ్ఞాన్, మోహన్, రాజు, డివిజన్ అధ్యక్షులు కాలం శ్రీనివాస్ రెడ్డి, హరీష్, వివిధ మండలాలకు చెందిన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.