వేసవి మొదలైంది. ఇక పెరటి తోటలు, బాల్కనీ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొనే సమయం ఆసన్నమైంది. అయితే, కొందరు వేళాపాళా లేకుండా మొక్కలకు నీళ్లు పెడుతూనే ఉంటారు. కానీ, తోట సంరక్షణలో నీరుపెట్టే సమయం చాలా ముఖ్యమైంది. కొన్ని సమయాల్లో నీరు పెట్టకపోవడమే మంచిది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం
4 గంటల మధ్య మొక్కలకు నీరు పెట్టడం వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది. నీరు మట్టిలోకి ఇంకిపోకముందే ఎండ వేడికి ఆవిరై పోతుంది. దాంతో మొక్కలకు తగినంత తేమ అందదు. ఆకులపై పడే నీటి చుక్కలు.. ‘మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్’లా పనిచేస్తాయి. ఇవి సూర్యరశ్మిని అధికంగా ఆకర్శించడం వల్ల.. ఆకులు ఎండిపోతాయి. మరికొందరు రాత్రి వేళలో నీళ్లు పెడుతుంటారు. ఈ పద్ధతి కూడా మంచిది కాదు. రాత్రిపూట ఎండ ఉండదు కాబట్టి.. ఆకులపై ఉండే నీరు త్వరగా ఆరిపోదు. తేమ అలాగే ఉండటం వల్ల మొక్కలకు ఫంగస్, తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది.
అంతేకాకుండా, రాత్రిపూట మొక్కలు నీటిని తక్కువగా పీల్చుకుంటాయి. దీనివల్ల కుండీలో నీరు అలాగే నిల్వ ఉండి.. వేర్లు కుళ్లిపోతాయి. కాబట్టి, సూర్యోదయం తర్వాత ఉదయం 6 నుంచి 9 గంటల లోపే మొక్కలకు నీళ్లు పెట్టాలి. ఈ సమయంలో గాలి చల్లగా ఉంటుంది. కాబట్టి నీరు మట్టిలోకి లోతుగా వెళ్తుంది. పగటి ఎండ వచ్చేసరికి మొక్కలు ఆ నీటిని ఉపయోగించుకుని తాజాగా ఉంటాయి. నీళ్లు పెట్టడానికి ముందు.. మట్టిని ఒక్కసారి పరీక్షించాలి. పైన మట్టి పొడిగా అనిపించినా, లోపల తేమగా ఉన్నట్టయితే, నీరు పెట్టకపోతేనే మంచిది. ఇక నీళ్లను ఆకులపై కాకుండా.. నేరుగా మొక్క వేర్ల దగ్గర పోయడం ఉత్తమం.