న్యూఢిల్లీ, ఆగస్టు 2 : ఏఐ, డాటా సెంటర్ మౌలిక సదుపాయాల వ్యయం విపరీతంగా పెరుగడంతో ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గిందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులను భారత్ కూడా ఎదుర్కొంటున్నదని అభిప్రాయపడ్డారు.
కొత్త ఉద్యోగాల కోసం పెట్టే ఖర్చును కార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం ఏఐ, సర్వర్లు, మెమోరీ ధరల పెరుగుదల వల్ల డాటా సెంటర్ల వ్యయాలకు కేటాయిస్తున్నాయన్నారు. ఏఐ టెక్నాలజీ సేవలు అందిస్తున్న సంస్థలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని, ఆ వ్యయానికి తగ్గట్టుగా లాభాలు ఆశిస్తున్నాయో తెలియడం లేదన్నారు. ఆటోమేషన్ వల్ల తయారీ రంగం కూడా భారీ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించలేకపోతున్నదన్నారు.