న్యూఢిల్లీ, ఆగస్టు 2 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..మాన్సూన్ ధమాకా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేటు 7.10 శాతం నుంచి 7 శాతానికి దిగొచ్చింది. దీంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను పూర్తిగా ఎత్తివేసింది.
తమ వినియోగదారులందరికీ ఉత్తమ ఆర్థిక ప్రయోజనాలను కల్పించడంతోపాటు వారి కలలను సాకారం చేసుకోవడంలో సహాయపడటానికి బ్యాంక్ ఎల్లప్పుడు కృషి చేస్తున్నదని, దీంట్లోభాగంగానే ఒకేసారి మూడు ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అందిస్తున్న అత్యల్ప గృహ రుణంపై వడ్డీరేటు 7 శాతం కాగా, వాహన రుణాలపై 7.45 శాతానికి అందిస్తున్నది బ్యాంక్ మాత్రమే. దీంతోపాటు జీరో ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు లేకపోవడంతో కస్టమర్లకు ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయని పేర్కొంది.