నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాల్లో భాగమవుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నది బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్. తాజాగా ఆమె ‘భారత్ భాగ్య విధాత’ పేరుతో రూపొందిస్తున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. 26/11 ముంబయి దాడుల సందర్భంగా కామా అండ్ ఆల్బ్లెస్ హాస్పిటల్ సిబ్బంది రోగులను రక్షించే క్రమంలో తీవ్రవాదులకు ఎదురొడ్డి పోరాటం చేశారు. టెర్రరిస్ట్లు ఆసుపత్రి గార్డ్స్ని చంపి, సిబ్బందిలో కొందరిని గాయపరచి అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించారు.
అయినా ఏమాత్రం బెదరని ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తితో రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఓ మారణహోమంలో ఆసుపత్రి సిబ్బంది చూపించిన తెగువ దేశవ్యాప్తంగా అందరి మన్ననలందుకుంది. ఈ సంఘటన ఆధారంగా ‘భారత్ భాగ్య విధాత’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ హెడ్ నర్స్ పాత్రలో నటిస్తున్నది. మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలిసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ‘ఎమర్జెన్సీ’ ‘తలైవి’ ‘మణికర్ణిక’ వంటి చిత్రాల్లో కంగనా రనౌత్ భాగమైన విషయం తెలిసిందే.