మహబూబాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘ఇక ముందు గెలుపేలక్ష్యంగా మన పయనం కొనసాగాలి.., ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలతో క్వార్టర్ ఫైనల్ ముగిసింది. రానున్న రోజుల్లో సెమీ ఫైనల్.., 2028లో ఫైనల్ మ్యాచ్ ఉంది.. ఫైనల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలి’ అని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సర్పంచులు, వార్డు సభ్యులకు పార్టీ గుర్తులు లేకున్నా ఇన్ని స్థానాలు గెలవడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ వారి కన్నా బాగా పనిచేసి గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాల్సిన మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డిని సీఎం కాకుండా అప్పట్లో కొంతమంది అడ్డుకున్నారని, కాంగ్రెస్‌లో మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా.. సంచులు మోసే వాళ్లకే అధిష్టానం సీఎం పదవి ఇస్తుందన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేయిస్తే.., ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారని, కాంగ్రెసోళ్లకు కనీసం నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న సోయి కూడా గతంలో రాలేదని ఆరోపించారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ప్రభుత్వంపై వ్యతిరేకతకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. 45 శాతం స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ గుర్తులతో జరిగే ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.
ఒకప్పుడు డోర్నకల్, తుంగతుర్తి కాల్వల్లో పిచ్చి మొక్కలు మొలిచి చుక్క నీరు రాలేదని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మానుకోటను జిల్లా చేశారని, మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించినట్లు తెలిపారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చి, తడి, పొడిచెత్తను వేరు చేసి గ్రామాలను శుభ్రంగా ఉంచినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే అవన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. అనంతరం ఇటీవల కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు వార్డు సభ్యులను కేటీఆర్ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, హరిప్రియానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బీరెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, యాకూబ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాగా, కేటీఆర్ రాక గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. అంచనాలకు మించి కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యులు తరలిరావడంతో ప్రాంగణం మొత్తం కికిరిసిపోయింది. కేటీఆర్ ప్రసంగం వినేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన జిల్లా నాయకులు, కార్యకర్తలను కేటీఆర్ అభినందించారు.

నూకల రామచంద్రారెడ్డికి నివాళులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఘనంగా నివాళులర్పించారు. శనివారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన కలెక్టరేట్ సమీపంలో నూకల రామచంద్రారెడ్డి విగ్రహావిషరణ ఉన్నదని తెలుసుకొని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనం అనంతరం అక్కడకు చేరుకున్నారు. విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
మానుకోట కేసీఆర్ అడ్డా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 27 : మానుకోట కేసీఆర్ అడ్డా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ తరఫున సర్పంచ్‌లుగా నిలబడి చాలామంది గెలిచారు. గ్రామీణ స్థాయిలో పార్టీకి చెక్కుచెదరని క్యాడర్ ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండానే ఇన్ని గెలిస్తే.., పార్టీ గుర్తుఉండే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే. బీఆర్ఎస్ సర్పంచ్‌లు అధికార పార్టీ నాయకులకు భయపడొద్దు. కేటీఆర్ నేతృత్వంలో మీకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన మొదట్లో పోలీస్, రెవెన్యూ అధికారులు మన కార్యకర్తలను ఇబ్బందిపెట్టారు. కానీ, ఇప్పుడు వారికి కూడా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అర్ధమైంది. కాంగ్రెస్ నాయకుల మాటలు వారు వినడం లేదు.
కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం, విశ్వాసం : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ఎంతో నమ్మకం, విశ్వాసం ఉం ది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతవాసి నూకల రామచంద్రారెడ్డికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. స్వయానా మానుకోటకు కేసీఆర్ వచ్చినప్పుడు నూకల రామచంద్రారెడ్డిని గుర్తు పెట్టుకొని విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పడంతో అధికారులు కలెక్టరేట్ ఎదుట ఆయన విగ్రహం పెట్టారు. ఆ మహనీయుడికి గుర్తింపు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే మానుకోటకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్, హార్టికల్చర్, నర్సింగ్ కళాశాలలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క పని కూడా పూర్తి చేయలేదు.
రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది.. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం చూసి సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది. అందుకే వెంటనే పెట్టాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి రేవంత్‌రెడ్డికి సెగ పుట్టింది. అందుకే బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నాడు. రేవంత్‌రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా కేసీఆర్‌కు గులాబీదళం బలంగా ఉంది. సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు ధైర్యంగా తమ పనులు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలి.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ప్రజా సమస్యలను పరిష్కరించేలా అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నిత్యం పోరాటం పోరాటం చేస్తుంది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపహాస్యం చేసి మాట్లాడారు. కేసీఆర్ ఒక్కరే అనేక మందిని తయారు చేసి రాష్ర్టాని సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడకుండా కార్యకర్తలు ధైర్యం ఉండాలి. ప్రస్తుత రాజకీయాల్లో యువత ఉత్సాహంగా ఉంది. నిరంతరం పత్రికలు చదువుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలి.
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే.. రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే. ఉద్యోగులు, ప్రజా సం ఘాల నాయకులు ఎంతోమందిని చైత న్యం చేసి రాష్ర్టాన్ని సాధించి విద్య, వైద్యం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృ ద్ధి చేశారు. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దడం.., ఐటీ కంపెనీలు తీసుకు రావడంలో కేటీఆర్ శ్రమ ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం : మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు తట్టుకొని బీఆర్ఎస్ ఇన్ని సర్పంచ్ స్థానాలు గెలవడం గొప్ప విషయం. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరింత కసిగా పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.
కాంగ్రెస్‌ది దౌర్జన్య పాలన.. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యపాలన చేస్తున్నది. అధికార బలంతో బీఆర్ఎస్ నాయకులను బెదిరించినా ఓపిక, సహనంతో ఉంటున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో అధికార బలంతో కరెంట్ తీసేసి ఫలితాలు తారుమారు చేశారు. అధికారులు కూడా వారికే వత్తాసు పలకడంతో బీఆర్ఎస్కు కొన్నిచోట్ల అన్యాయం జరిగింది.
మాట నిలబెట్టుకోని రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత
రైవంత్రెడ్డి అనేక వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకోలేదు. 420 హామీలు ప్రకటించి ఒక్కటి కూడా అమలు చేయలేదు. సీఎం స్థాయిలో ఉండి ఇష్టమొచ్చిన భాషలో కేసీఆర్ గురించి మాట్లాడడం సరికాదు. రేవంత్‌రెడ్డి పనివిధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారే కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం.
శ్రేణులను ఇబ్బందిపెడుతున్నరు.. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, హరిప్రియానాయక్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను అధికార పార్టీ నాయకులు, పోలీసులు బెదిరించినా ఎక్కడా అధైర్యపడకుండా పోరాడి గెలుపొందారు. గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్లు కాంగ్రెస్ ప్రలోభాలకు గురి కావొద్దు.
కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నయ్.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి
నెల్లికుదురు : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థుల గెలుపును చూసి కాంగ్రెస్ గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు ప్రచారం చేసినా ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా 50శాతం బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఈ లెక్కన కాంగ్రెస్ పని ఖతనమైపోయినట్లే. కేసీఆర్ సార్ బయటకు రాగానే రాజకీయం వేడెక్కింది. రేవంత్‌రెడ్డి గాయ్, గాయ్ అయితాండు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు 100 స్పీడ్‌తో దూసుకెళ్లడం ఖాయం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి దిగజారుడు భాషను మార్చుకుంటే మంచిది.