వర్ధన్నపేట, మార్చి 21 : వంటగ్యాస్ మంట గ్రామాలకూ తాకింది. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పట్టణాలతోపాటు పల్లెలకూ చేరింది. యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతతో ఊళ్లలో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా నిత్యం ఉదయం 4 గంటలపాటు నిర్వహించుకొనే టిఫిన్ సెంటర్లు, సాయంత్రం సమయంలో మిర్చి, బజ్జీలు అమ్ముకునే వ్యాపారులు హోటళ్లను మూసేస్తున్నారు. చికెన్ సెంటర్లలో బ్రాయిలర్‌కు ఇబ్బంది లేకపోయినా ఫా మ్, నాటుకోళ్ల వ్యాపారులకు గ్యాస్ అవసరం. వాటిని కూడా తెరవడం లేదు.
దీంతో చిరు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్ సెంటర్లలో పనిచేసే దినసరి కూలీలకు ఉపాధి లభించకపోవడం తో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. వారి కు టుంబాలు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. గ్రామా లు, మండల కేంద్రాల్లో యువకులు ఉపాధి కోసం రోడ్ల పక్కన ఏర్పాటు చేసుకొనే తినుబండారాలకు సంబంధించిన సెంటర్లు కూడా నడవడంలేదు. సాయంత్రం సమయంలో మద్యం దుకాణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద చిరువ్యాపారులు, టిఫిన్ సెంటర్ల వద్ద సందడి ఉంటుంది. గ్యాస్ కొరత కారణంగా ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
గ్యాస్ కొరతతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, ఎంఆర్సీబీలపై దాడులు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు కమర్షియల్ గ్యాస్‌కు బదులుగా ఇండ్లలో ప్రజలకు సబ్సిడీపై లభించే గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. దీనిని గుర్తించిన అధికారులు మండల కేంద్రాలతోపాటు కనిపించిన చిన్న చిన్న హోటళ్లలో సైతం సోదాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వర్ధన్నపేట మండలంలోని ఇల్లందతోపాటు వర్ధన్నపేట పట్టణంలో పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు.
పలు టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లో వంటగ్యాస్ సిలిండర్లు దొరకడంతో ఆయా హోటళ్ల యజమానులపై కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న చిన్నచిన్న వ్యాపారులు సైతం టిఫిన్ సెంటర్లు, బజ్జీల కొట్లు తీయడంలేదు. అంతేకాక గ్రామాల ప్రజలు కూడా గ్యాస్ కొరత తీవ్రమవుతుందనే భావనతో పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి సిలిండర్లు తెచ్చుకుంటున్నారు. కాగా, గ్యాస్ దొరకడం మరింత ఇబ్బంది మారుతుందని తెలుస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.