వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎంహెచ్ కూడలిలో లారీ భీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో నిరక్ష్యంగా వ్యవహరించడం మూలంగా డివైడర్ని ఢీకొట్టి, రోడ్డుకు అడ్డంగా వెళ్లి ప్రభుత్వ పశువైద్యశాల గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. నిత్యం రద్దీగావుండే ప్రధాన రహదారిపై డివైడర్ని దాటుకొని లారీ ముందుకు రావడంతో అంతా ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్‌కు కోళ్ల దానతో వెలుతున్న లారీ సోమవారం ఉదయం సుమారు 9:20గంటలకు ఆటోనగర్ నుండి ఎంజీఎంహెచ్ కూడలి మీదుగా హంటర్ రోడ్డు వైపునకు వెళ్లాల్సివుంది.
ఆటో నగర్ నుండి ఎంజీఎంహెచ్ కూడలికి చేరుకునే క్రమంలో ఎడమ వైపునకు తిరగాల్సిన లారీ నేరగావెళ్లి డివైడర్ మీద నుండి దూసుకువెళ్లి, ఎదురుగావున్న ప్రభుత్వ పశువైద్యశాల గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఓ చిరువ్యాపారి ఏర్పాటు చేసుకున్న డబ్బా పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ సమయంలో ఎంజీఎం ముందు నుండి హనుమకొండ వైపుకు వెళ్లే వాహణదారులు రెడ్ సిగ్నల్ పడివుండడంతో అటుగా వాహణాలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ సుజాత తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు భారీ క్రేన్ల సహాయంతో లారీ తొలగించి, రాకపోకలు పునరుద్దరించారు. లారీ డ్రైవర్‌ను, ప్రమాదానికి గురైన లారీని పదుపరి విచారణ నిమిత్తం స్థానిక మట్టెవాడ పోలీసులకు అప్పగించినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.