కొడకండ్ల, మే 9 : ప్రభుత్వం అప్పుల్లో ఉందని తెల్లవారితే వార్తల్లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్తుంటే, ఇక్కడ మాత్రం అధికారులు అనవసర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, నాసిరకం, నాణ్యత లేని పనులు చేపడుతున్నారు. కాంట్రాక్టర్లు లాభాలు, అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి రూ.2.6 కోట్ల నిధులతో కొడకండ్ల మండలం, నర్సింగాపురం బయ్యన్న వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. దీనికి 500 మీటర్లలోపే 0.25 టీఎంసీల రిజర్వాయర్, 200 మీటర్లలోపే ఒక కుంట ఉంది. రైతులు కూడా ఇక్కడ చెక్‌డ్యాం వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పనులు చేస్తున్నారు. అవగాహన లేమితో అప్పటి ప్రజాప్రతినిధులు చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రపోజల్ పంపడంతో బీఆర్ఎస్ అనుమతి ఇచ్చింది. అయితే, స్థానిక ప్రజలు, రైతులు వద్దనడంతో చెక్ డ్యాం నిర్మాణాన్ని నిలిపి వేసింది. ఈ క్రమంలో రెండు సార్లు నిర్మాణం చేపడుతామని అధికారులు వస్తే రైతులు అడ్డుకున్నారు.
అప్పట్లో కలెక్టర్‌కు సైతం వినతి పత్రం ఇచ్చి పనులు నిలుపుదల చేశారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టు ప్రాంతాన్ని కొద్ది దూరానికి మార్చి మరోసారి అనుమతులు తీసుకొచ్చారు. 200 ఎకరాల ఆయకట్టు దీని పరిధి. కానీ, కనీసం 20 ఎకరాలకు కూడా దీని అవసరం లేదు. అంతకు ముందే ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది. ఆ ప్రాంతంలో చెక్‌డ్యాం అవసరం లేదని తెలిసినా తక్కువ కెపాసిటీ గల చిన్నదాన్ని కూల్చివేసి ఆ ప్రాంతంలో రైతులు వద్దని వారించినా వినకుండా పెద్ద చెక్‌డ్యాం నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఎవరి లాభాల కోసం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్‌ని వివరణ కోరగా అప్పటి మాజీ సర్పంచ్ గ్రామ సభ ద్వారా అనుమతి కోరితేనే మంజూరు చేసినట్లు తెలిపారు.
కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామంలోని బయ్యన్నవాగులోని చెక్ డ్యాం నిర్మాణ స్థలానికి 500 మీటర్ల దూరంలోనే 0.25 టీఎంసీ నిల్వ గల రిజర్వాయర్ ఉంది. దగ్గర్లోనే ఒక కుంట కూడా ఉంది. భూగర్భ జలాల శాతం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువనే ఉంది. అప్పటి ప్రజాప్రతినిధులు అవగాహన లేమితో ప్రతిపాదన పంపగా రైతులు వద్దనడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం కూత వేటు దూరంలో రిజర్వాయర్ ఉన్నా రూ.2.6 కోట్ల నిధులతో చెక్ డ్యాం పనులు చేపడుతున్నారు. వాగులో నిరంతరం రిజర్వాయర్ ఊట నీరు ప్రవహిస్తూ రైతులకు వానకాలం, యాసంగి పంటలకు అందుతుంది. రిజర్వాయర్ నుంచి వచ్చే ఊట నీరును మొత్తం ఈ వాగులో వదులుతారు. ఇక్కడ చెక్‌డ్యాం నిర్మాణంతో ఏ రైతుకూ ప్రయోజనం లేదు. చెక్ డ్యాం నిర్మాణంతో సుమారు 200 మీటర్లు మాత్రమే నీరు నిలిచి ఉంటుంది. కానీ, అక్కడి రైతులు అంతకు ముందే ఊట బావిలో నీరు పుష్కలంగా వస్తుందని, దగ్గరలోనే ఎన్నో రెట్ల నీరు నిలువ గల రిజర్వాయర్ ఉందని చెబుతున్నారు.
చెక్ డ్యాం పనులకు మొదటి నుంచీ లోకల్ ఇసుక, వాగులో ఉన్న ఇసుకను వాడుతున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించారని రైతులు వాపోతున్నారు. కొంత డస్ట్ వాడుతూ, కొంత లోకల్ ఇసుకను వాడుతున్నారు. లోకల్ ఇసుక అందుబాటులో లేకపోతే ఫిల్టర్ చేసి నిర్మాణానికి వినియోగించినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. సిమెంట్ బస్తాలు కూడా నాసిరకంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. చెక్ డ్యామ్‌కు ఇరువైపులా మట్టితో నిర్మాణం చేయాల్సి ఉండగా అది కూడా అరకొరగా చేస్తూ తప్పించుకుంటున్నారు. దీంతో తమ పంట పొలాలు మునిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. సైడ్లకు మట్టి నిర్మాణంతో పాటు, రాతి నిర్మాణం కూడా లేదని చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.6 కోట్ల నిధులతో అనవసరమైన ప్రాజెక్టును నిర్మిస్తుంది. కూడా పూర్తిగా నాణ్యత లేకుండా, లోకల్ ఇసుకను వాడుతున్నారు. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిర్మాణంలో ఎక్కువ శాతం డస్టునే వాడారు. సిమెంటు బస్తాలు కూడా నాసిరకంగా ఉన్నాయి. మంత్రంగా చెక్‌డ్యాం పూర్తి చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కట్టే బదులు అవసరమైన చోట కడితే బాగుండు. రైతు భరోసా, రుణ మఫీ, బోనస్‌లాంటి పూర్తిగా ఇవ్వలేదు. కానీ ఎవరి లాభం కోసమో ఇలాంటి నిర్మాణాలకు రూ.కోట్లు పెట్టి ప్రజధనం దుర్వినియోగం చేస్తున్నారు.
మాకు కూతవేటు దూరంలో రిజర్వాయర్ ఉంది. నీరు ఇంతకు ముందే పుష్కలంగా ఉంది. అప్పటి ప్రజాప్రతినిధులు అవగాహన లేక చెక్‌డ్యాంకు అనుమతులు తెచ్చిండ్రు. కానీ, మాకు వద్దు, దీని వల్ల లాభం కంటే నష్టం ఉందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణం ఆపింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎలాంటి సమాచారం లేకుండా నిర్మాణానికి అనుమతి వచ్చింది. ఆగమాగం చేసుకుంటా నిర్మాణం పూర్తి చేశారు. వద్దు అని చెప్పే సమయం ఇవ్వకుండా టకటకా కట్టారు. ఇప్పుడు మా పొలాలు మునిగేటట్టు ఉన్నాయి. సైడుకు కట్టలు పోయాలని చెప్పినా వినకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మాకు న్యాయం చేయాలి. ఈ చెక్ డ్యాం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదు.