స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారై, షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతయా? జరుగవా? అనే సందిగ్ధత నెలకొంది. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు వేయడంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందా? లేదా? 50 శాతంలోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని కోర్టులు తీర్పు ఇస్తాయా? అనే ఆందోళన ఆశావహుల్లో తీవ్రమైంది. ఒకవేళ ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లు కొట్టివేస్తే తమ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వారిని నిద్రకు దూరం చేస్తున్నది.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పోటీ చేయాలనుకునే పాత, కొత్త వారిలో నైరాశ్యం ఆవహించింది. ప్రస్తుత రిజర్వేషన్ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయి. ఇదే విషయంలో పలువురు హైకోర్టును ఆశ్రయించగా, విచారణ ఈ నెల 8న జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో మళ్లీ రిజర్వేషన్లు మారే పరిస్థితి వస్తుందా? అని ప్రజలు, రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా, మొదటి విడుత ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
– హనుమకొండ, అక్టోబర్ 5
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసారి చాన్స్ ఇవ్వండి.. గెలుస్తామంటూ పలువురు ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎప్పటి నుంచో పార్టీని పట్టుకొని ఉన్నామని, రిజర్వేషన్ సౌకర్యం కలిసివచ్చిందని, ఈ సారి తాము పోటీ చేసేందుకు సహకరించాలంటూ ప్రాధేయపడుతున్నారు. షెడ్యూల్ విడుదలవడంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలుకావడంతో రిజర్వేషన్లు కలిసివచ్చిన వారు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే రాక రాక వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వొద్దనే పట్టుదలతో ఆశావహులు ముందుకు సాగుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కొందరు హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఎలాంటి తీర్పు వస్తుందోననే ఆందోళన వారిని వేధిస్తున్నది. ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? రిజర్వేషన్లు మారే అవకాశం ఉందా? ఒకవేళ మారితే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు కొనసాగుతాయా? అనే సందేహాలు వారిని పట్టిపీడిస్తున్నాయి.