యాదాద్రి భువనగిరి, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వల ఆధునికీకరణ పనుల ఊసేలేదు. వృథాగా పోతున్న మూసీ జలాలను సద్వినియోగం చేసుకుని ఆయకట్టును మరింత స్థిరీకరించేందుకు గతేడాది పిల్లాయిపల్లి కాల్వకు రూ. 86 కోట్లు, ధర్మారెడ్డిపల్లికి రూ. 124 కోట్లు, బునాదిగాని కాల్వకు రూ. 266 కోట్ల పరిపాలనాపరమైన అ నుమతులు వచ్చాయి. కాల్వల నీటి ప్రవాహ సామర్థ్యం, కాల్వల పొడవు, వె డల్పు పెంచనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే భూసేకరణ సమస్యగా మారింది. బునాదిగాని కాల్వకు అకడకడా పైపై మెరుగులు దిద్దుతున్నారు. వీటి పనులు పూర్తయితే భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
బస్వాపూర్‌ను పట్టించుకోరా?
రైతుల తలరాతను మార్చే బస్వాపూర్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. తుది దశకు వచ్చిన ఈ ప్రాజెక్టు పనులను పట్టించుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు నల్లగొండలోని కొన్ని మండలాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు కావాలని గతంలోనే నీటిపారుదల శాఖ అ ధికారులు సరార్ కు ప్రతిపాదనలు పంపించారు. గతేడాది రూ. 30కోట్లు ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజి కింద పంపిణీ చేశారు. ఇంకా మరో రూ. 80 కోట్లు అవసరం. నిధులు వస్తేనే ముంపు గ్రామం బీఎన్ తిమ్మాపూర్‌ను ఖాళీ చేయించే అవకాశం ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.
గంధమల్లకు బాలారిష్టాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-15లో తురపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని గత ప్రభుత్వం 2017లో ప్రతిపాదించింది. 9.36 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని మొదట నిర్ణయించగా.. ఆ తర్వాత 4.28 టీఎంసీలకు కుదించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ 1.41 టీఎంసీలకు తగ్గించింది. ప్రారంభంలో రిజర్వాయర్‌ను రూ.860 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించగా.. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో రూ.575 కోట్లకు పరిమితమైంది. అయితే గతేడాది జూన్ 6న గంధమల్లకు భూమి పూజ చేశారు. ఆ తర్వాత పనులు నెమ్మదించాయి. ఇటీవల కేవలం బండ్ నిర్మాణానికి రూ.22 కోట్ల పరిహారం అందించారు. రిజర్వాయర్ పూర్తయితే 58,687 ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉన్నది.
ఎన్నో పెండింగ్ పనులు
యాదగిరిగుట్ట అభివృద్ధి పనులు వేగవంతం కావడం లేదు. టెంపుల్ సిటీపై కాటేజీలు, గండి చెరువు సుందరీకరణ, రోప్ వే, కల్యాణ కట్ట వద్ద సీఆర్ పనులను పట్టించుకోవడం లేదు.జిల్లాలోని భువనగిరి – చిట్యాల రోడ్డు (నాలుగు వరుసల రహదారి) విస్తరణకు మోక్షం కలగడం లేదు.ఆలేరు రెవెన్యూ డివిజన్ హామీ కలగానే ఉంది. రాయగిరిలో ఏర్పాటు చేస్తామన్న మల్టీ పర్పస్ స్పోర్ట్స్ స్టేడియం పత్తాలేదు. భువనగిరి, చౌటుప్పల్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఐటీ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ హామీ అటకెకింది. భువనగిరిలో డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు హామీ నెరవేరలేదు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనకి అన్న చందంగా పరిస్థితి తయారైంది. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల పనులు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు వస్తే తప్ప పనులు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ప్రగతి ఫలాలు దకడంలేదు. ప్రస్తుత బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.