జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 12( నమస్తేతెలంగాణ) : పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో సకల సౌకర్యాలు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. వీఐపీ ఘాట్, కామన్ ఘాట్ల వద్ద మహిళల కోసం దుస్తులు మార్చుకొనేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటుచేశారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా మత్స్య, నీటి పారుదల శాఖల ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి ఏర్పాట్లుచేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు వేయించారు. వరంగల్ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 200 ఆర్టీసీ బస్సులు నడుపనున్నారు.
కాళేశ్వరం నుంచి పుష్కరఘాట్ వరకు వెళ్లేందుకు 10 మినీ బస్సుల ద్వారా ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అలాగే కాళేశ్వరం పీహెచ్సీ కేంద్రంగా ఐదు ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు 120 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. అత్యవసర సేవల కోసం రెండు 108 వాహనాలు అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తెలిపారు. 150మంది పారిశుధ్య కార్మికులతో ఘాట్లు, పార్కింగ్ పాయింట్లు, ఆలయ పరిసరాల్లో నిరంతరం శుభ్రం చేయిస్తున్నట్లు డీపీవో ఆశాలత చెప్పారు. భద్రత చర్యలతో 60 సీసీకెమెరాలతో పర్యవేక్షించడంతో పాటు డ్రోన్ కెమెరాలను సైతం వినియోగించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం ప్రతిరోజు 850మంది పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. భక్తుల వాహనాలను నిలిపేందుకు నాలుగు పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాళేశ్వరం : మధ్యాహ్నం 3.54 గంటల ప్రాంతంలో పుష్కర స్నానాలు ఆరంభమవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అర్చకులు, ప్రజాప్రతినిధులు మంగళవాయిద్యాలతో త్రివేణి సంగమం వద్ద ఉన్న వీఐపీ పుష్కర ఘాట్ వద్దకు ఊరేగింపుగా వెళ్లి నదిలో పుష్కర ఆవాహనం పుష్కరస్నాన సంకల్పం, పుష్కర పూజ చేసి ప్రారంభించనున్నారు. అనంతరం కలశాలతో వచ్చి కాళేశ్వర-ముక్తీశ్వర స్వామికి అభిషేకం చేయనున్నారు.