హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదామని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ మహిళా ఉద్యోగినుల ఆధ్వర్యంలో పరిపాలన భవన ప్రాంగణంలో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంతో కలిసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేకతను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మనం గౌరవంగా జరుపుకోవాలని, ఇది ప్రకృతిని పూజించే, సాంప్రదాయాలను నిలుపుకునే పండుగన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ బతుకమ్మ పండుగ చోళుల కాలం నుంచే ఉందని, ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగిన పండుగ అన్నారు. ప్రతి పువ్వు ప్రత్యేకతను కలిగి ఉండి, దీని ద్వారా ప్రకృతి పట్ల మానవుల అనుబంధం తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బి.రమ, బి.సుకుమారి, అనితారెడ్డి, చిర్రా రాజు, బోధన, బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.