వరంగల్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పుండు ఒక దగ్గర అయితే.. మందు మరో దగ్గర వేసినట్టే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతి సమీక్షా సమావేశం ఎట్టకేలకు హైదరాబాద్‌లో జరిగింది. అదీ మూడు నాలుగు రోజులుగా ముసురుపట్టి ఊరువాడా తడిసి ముద్దవుతుంటే ‘అర్జంట్‌గా రండి… అభివృద్ధిపై సమీక్షిద్దాం’ అన్నట్టుగా రాత్రికి రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపు రావడంతో హుటాహుటిన శనివారం అందరూ హైదరాబాద్‌కు పరుగులు తీశారు. ఆగమేఘాల మీద సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏమిటీ? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఈనెల 15వ తేదీన ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని, మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు వెళ్లాయి. మరోవైపు నిర్ణీత సమావేశానికి హాజరు కావాలని ఈనెల 13వ తేదీన ఆరు జిల్లాల కలెక్టర్లు, నగర పోలీస్ కమిషనర్ సహా సంబంధిత జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించింది. ఈ మేరకు 15వ తేదీన సమావేశానికి అంతా సిద్ధం అయ్యారు.
కొందరు హైదరాబాద్ బయలుదేరారు. మరికొందరు బయలుదేరేందుకు సిద్ధం అయ్యారు. అప్పుడు సమావేశం వాయిదా పడింది. వాయిదా పడిన సమావేశం ఈనెల 21వ తేదీన నిర్వహిస్తామని మంత్రి పేషీ నుంచి సమాచారం వచ్చింది. అయితే, ఈసారి హైదరాబాద్‌లో కాకుండా హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉంటుందన్నారు. ప్రకటించినట్టుగానే భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరికొత్తపల్లి, గణపురం, భూపాలపల్లి మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం సమీక్షించేందుకు షెడ్యూల్ విడుదల అయింది. ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి.
మంత్రులు భూపాలపల్లిలో పర్యటించారు. కానీ, హనుమ కొండ సమావేశం వాయిదా పడింది. మళ్లీ రెండు రోజులకు హైదరాబాద్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈలోపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల ముసురు, జిల్లాల్లో వానలు. కలెక్టర్లు సహా అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలను అప్రమత్తం చేసేపనిలో నిమగ్నం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు శనివారం సమావేశానికి రావాలని ఆదేశాలు.. అంతే యూరియా సమస్య, ముసురుతో జనం ఉంటే జనానికి అందులో ఉంటూ ఏర్పాట్లు చేయాల్సిన ఆరు జిల్లాల సమస్త అధికారగణం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశం తీరుపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.