ఖిలావరంగల్ : ప్రజల మద్దతుతో వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూటకో మాట చెబుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయి. రాష్ర్టానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ఒక దళమై.. ఒక బలమై తెలంగాణ గళాన్ని పార్లమెంట్లో వినిపించాల్సిన అవసరముంది. ఇందుకోసం ప్రజలు తమ పూర్తి మద్దతు తెలపాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ సహా మూతపడిన అనేక పరిశ్రమలను తెరిపించేందుకు పోరాడుతా. అజాంజాహి మిల్లు మూతపడడం వల్ల ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కేసీఆర్ టెక్స్టైల్ పార్క్‌ను నిర్మించారు. భూపాలపల్లి జిల్లాలో బొగ్గు సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. కేసీఆర్ ప్రభుత్వం హయంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమాలు గాలికొదిలేశారు. వరంగల్ ప్రజలు ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి. పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రను ప్రజలు ఒకసారి పరిశీలించాలి.
ఖిలావరంగల్ :తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు 20 ఏళ్లు పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ సుధీర్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలి. ఉన్నత విలువలతో కూడిన సుధీర్‌కుమార్‌కు కేసీఆర్ వరంగల్ టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. అవతల పార్టీలో ఉన్న అభ్యర్థులు ప్రజలను ఎన్నిసార్లు మోసం చేశారో గుర్తుచేసుకోవాలి. మంచి చరిత్ర ఉన్న సుధీర్‌కుమార్ వ్యక్తిత్వాన్ని, ఉన్నత ఆశయాలను మేధావులు విశ్లేషణ చేసి ప్రజలకు తెలియచేయాలి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వల్లనే వరంగల్‌కు రావాల్సిన పరిశ్రమలు రాకుండా పోయాయి. కానీ కేసీఆర్ హయాంలోనే వరంగల్ జిల్లాకు న్యాయం జరిగింది. కడి యం చాలా నీతిమంతుడని మాట్లాడుతున్నాడు, గతంలో ఆయన వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను తెలుసుకోవాలి. ప్రజలంతా సుధీర్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. నేడు వరంగల్, వర్ధన్నపేట సభలకు కేటీఆర్ హాజరవుతా రు. 28న వరంగల్‌లో కేసీఆర్ రోడ్‌షో ఉంటుంది.
బ్రోకర్లు, నమ్మకద్రోహులు మాత్రమే పార్టీని వీడుతున్నారు తప్ప కార్యకర్తలు వెళ్లడం లేదని ఎర్రబెల్లి అన్నారు. బీఆర్ఎస్ నుంచి లబ్ధిపొంది పార్టీ మారిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలన్నారు. కడియం, అరూరి లాంటి ద్రోహులను వరంగల్ ప్రజలు సహించరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. శ్రీహరికి తాను రాజకీయ జీవితం ఇస్తే తనపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలపై తప్పుడు పోలీస్ కేసులు పెడితే పోలీస్స్టేషన్ల ముందు బైఠాయిస్తామని తెలిపారు. సర్పంచ్‌లకు రావాల్సిన న్యాయమైన పెండింగ్ బిల్లులను పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పించేందుకు పోరాటం చేస్తానని చెప్పారు. సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు సుందర్రాజు యాదవ్, మర్రి యాదవరెడ్డి, పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు, సోదా కిరణ్, మైనార్టీ నేత నయీముద్దీన్ పాల్గొన్నారు.
హనుమకొండ, ఏప్రిల్ 22 : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్‌కుమార్ 50వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ వరంగల్‌లో బీఆర్ఎస్సే గెలుస్తుందని చెబుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్ నామినేషన్ దాఖలు తర్వాత హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఏకశిల పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించగా పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఓ బ్రోకర్ అని, అతడిని ప్రజలెవరూ నమ్మరని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అంటున్నాడని, ఒకవేళ అప్పటివరకు కూడా అమలుచేయకపోతే తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు, రాష్ట్రపతికి బాండ్ పేపర్‌పై రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురడం ఖాయం. దక్షిణ భారతదేశంలోనే ధిక్కార స్వరానికి, పోరాటానికి మారుపేరు వరంగల్ గడ్డ. ఏ పార్టీలో ఉన్నా కడియం కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. కేసీఆర్‌పై ఈగ వాలకుండా వరంగల్ సత్తా చూపించాలి. స్వార్థపరుడు అరూరి, మోసకారి, వెన్నుపోటుదారుడు కడియం శ్రీహరిని వరంగల్ ప్రజలు నమ్మరు. తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం కోసం పార్లమెంట్లో గొంతెత్తింది బీఆర్ఎస్ పార్టీయే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంపై కుట్రలకు తెరలేపుతున్నారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్న కడియం శ్రీహరి ఎన్నికల సందర్భంగా ఎన్ని డబ్బులు తెచ్చుకున్నాడో దేవుడిమీద ప్రమాణం చేయాలి. కడియం, అరూరి లాంటి వ్యక్తులను భూస్థాపితం చేయాలంటే వజ్రాయుధం లాంటి ఓటుతోనే సాధ్యం. త్వరలో వరంగల్ ప్రజలు వారికి బుద్ధి చెప్పడం ఖాయం.
‘బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ద్రోహులకు ఓటుతో బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరగడంతో పాటు పార్టీకి ద్రోహం చేసిన వారిని ఓడగొట్టాలనే కసి, పట్టుదల పెరిగింది.. ఇదే స్ఫూర్తితో వరంగల్ పార్లమెంట్‌పై గులాబీ జెండా ఎగురవేయాలి. రాబోవు తరాలకు ఇలాంటి నీచుల చరిత్ర ఉండేలా ప్రజాతీర్పు ఉండాలి. పార్టీ వీడిన వారు అవినీతిపరులు, అహంకారులు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు. ఎవ్వరైనా గులాబీ శ్రేణులను టచ్ చేస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు.. ఖబడ్దార్.
స్టేషన్ ఘన్‌పూర్‌ను అభివృద్ధి నేనే చేశానంటున్న కడియం శ్రీహరి అభివృద్ధిపై అదే ఘన్‌పూర్‌లో రచ్చబండ చర్చకు సిద్ధమా. తెలంగాణ ద్రోహి, నమ్మక ద్రోహి, కేసీఆర్‌ను బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని పార్టీని మోసం చేశాడు. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ అధికార దాహంతో కేసీఆర్‌కు వెన్నపోటు పొడిచాడు. నీ రాజకీయ జీవితానికి ప్రజలు చరమగీతం పాడడం ఖాయం. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని ఆ పార్టీలో చేరడం సిగ్గుచేటు. కడియం శ్రీహరిది భస్మాసుర హస్తం.. కడియంను పార్టీలోకి తీసుకొని రేవంత్‌రెడ్డి తన గోతిని తానే తవ్వుకున్నాడు.