బయ్యారం జూలై 24: పుస్తెలతాడు తాకట్టుపెట్టి పెట్టుబడి పెడితే వేసిన పంట ఎండిపోయి నష్టపోగా..‘నమస్తే తెలంగాణ’ కథనంతో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గంధంపల్లికి చెందిన మహిళ కౌలు రైతు నాయిని నాగమణి ఆరెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేసింది. వేసిన మక్క పంట సరిగ్గా పెరగాకపోవడం, పెరిగిన కొద్ది పంట ఎండిపోవడంతో ఆవేదన చెందిన మహిళ రైతు పంట చేనులో కూర్చుని బోరున విలపించింది.
అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే.. నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేశారని.. అప్పు ఎలా తీర్చాలని, తమను ఆదుకోకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడమే..శరణ్యమని పంట చేన్లో కూర్చుని ఏడ్చింది.
ఈ ఘటనపై ఈనెల 23న ‘పెట్టుబడికి పుస్తెలతాడు తాకట్టు’ అనే కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించడంతో ఈ విషయంపై మాజీమంత్రి కేటీఆర్ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మండల అధ్యక్షుడు తాతా గణేష్ ద్వారా విషయంపై ఆరా తీశారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించడంతో రూ.50వేల ఆర్థిక సహాయాన్ని కౌలు రైతు కుటుంబానికి అందించారు. అయితే పుట్టినరోజు వేళ మహిళా రైతును ఆదుకున్న కేటీఆర్ పెద్ద మనసును పలువురు అభినందించారు.