ఏటూరునాగారం, జూలై 4 : ములుగు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రతీ ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు, నాయకులు తాటి కృష్ణ, వలీబాబా, కుర్బాన్ అలీ, యలవర్తి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, గద్దల రఘు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలపై విస్త్రతంగా చర్చించారు. ప్రతీ ఓటును పరిరక్షించే బాధ్యతతో అప్రమత్తంగా పని చేయాలని పిలుపు నిచ్చారు.
త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రతీ కార్యకర్త, ప్రతీ అభిమానికి సభ్యత్వం అందేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తున్నారంటూ అభినందించిన కేటీఆర్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగుర వేసే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పార్టీ కోసం పని చేసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆదేశించారు. జిల్లా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.