ఖిలావరంగల్, అక్టోబర్ 30: భారీ వర్షాలు, వరదలతో భీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో గ్రేటర్ వరంగల్ (Greater Warangal) పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంటలే కాక, లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు కూడా వరదనీటిలో చిక్కుకుపోయాయి.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 17వ డివిజన్లోని విలీన గ్రామాల రైతులను తుఫాన్ నిండా ముంచింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తూ పూర్తిగా నేలకొరిగాయి. అలాగే, ఖిలా వరంగల్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వందల ఎకరాల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయల తోటలు ఏకంగా 6 అడుగుల నీటి కింద మునిగిపోయాయి.

కోట ప్రాంతంలో సుమారు 50 మంది రైతులు తమ సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. కళ్ల ముందు పంట నాశనం కావడంతో, వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కష్టపడి సాగు చేసిన పంట వారం రోజుల్లో చేతికి వస్తది అనుకున్న అన్నదాతల ఆశ ఆడియోసలైంది. మొత్తం తుఫాన్‌కు ఆహుతి కావడంతో, ఆపదలో ఉన్న తమను ఆదుకోవాలని, కనీసం పెట్టుబడికైనా సాయం చేయాలని వారు మానవత్వంతో కూడిన ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

రైతుల పరిస్థితి ఇలా ఉంటే, లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనం కూడా దుర్భరంగా మారింది. శివనగర్, మైసయ్య నగర్, ఆర్ఎస్ నగర్, చింతల్ ప్రాంతాల్లోని అనేక కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా శివనగర్ మరియు మైసయ్య నగర్లలోని ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోని గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు అన్నీ నీటిలో తడిచి ముద్దయ్యాయి. రాత్రంతా నిద్రలేని రాత్రులు గడిపి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. వరద బాధితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు శివనగర్‌లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల్లో బల్దియా పారిశుధ్య కార్మికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లమీద, డ్రైనేజీ, నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.