కురవి, జూలై 30 : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, యువ రైతు బానోత్ రమేష్ బుధవారం తన వరి పొలంలో వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. వరి నారు మడిలో ‘కేసీఆర్’ అనే అక్షరాలను వరి నారుతో రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ..వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని చెప్పి రైతులకు భరోసా కల్పించిన మహానేత కేసీఆర్ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసిం చారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పథకాలు రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరినిచ్చాయని అభిప్రాయపడ్డారు. వరి పొలంలో రైతు వ్యక్తీకరించిన ఈ వినూత్న అభిమానం గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది.