Harish Rao | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని అన్నారు. పేదల ఇండ్లు కూల్చి, మెగా కృష్ణారెడ్డికి భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. పేదలకు డబ్బులు లేవని చెప్పే ముఖ్యమంత్రికి.. వందల కోట్లతో క్యాంపు ఆఫీసులకు పైసలు ఎక్కడివని ప్రశ్నించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంఛార్జి కార్తీక్ రెడ్డి తదితరులు కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపిన హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్‌కు మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో మర్చిపోలేని అనుబంధం ఉందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారని.. టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ మంచినీళ్లు లేక మీరు అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే, అప్పటికప్పుడు HMWS అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారని తెలిపారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి మరీ మీకు నీళ్లు ఇచ్చారన్నారు. సబితక్కకు మీరు ఒక్క ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ ముందు రోడ్డు వేయించారని పేర్కొన్నారు. నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్ రెడ్డి మూసీని క్లీన్ చేయించి మీకు దోమల బెడద లేకుండా చేశారన్నారు. కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఆలోచించారని తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జేసీబీలతో దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
మూసీ ప్రాజెక్టుకు ఇప్పటివరకు డీపీఆర్ తయారు కాలేదు.. ఇప్పటివరకు Maximum Flood Level ఫిక్స్ కాలేదు
ఇప్పటివరకు Social Impact Assessment జరగలేదు.. Environment Clearance తీసుకురాలేదు. ఇవన్ని లేకుండా ఇండ్లు కూల్చేస్తామని నోటీసులు ఎలా ఇచ్చారు?
దీనిపై న్యాయపరంగా మూసీ బాధితులకు బీఆర్ఎస్… pic.twitter.com/rnqKChh8RA
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2026
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని.. పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ. 3800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పని ప్రారంభించిందని తెలిపారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డీపీఆర్‌లను కూడా కేసీఆర్ ప్రభుత్వం తయారు చేయించిందని తెలిపారు. అప్పుడు మా ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదని చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుందని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు.
ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశాడని హరీశ్‌రావు తెలిపారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట మీ ఇండ్లు కూల్చి, మీ భూములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని అన్నారు. మేం మీ జేబులు నింపుకోవడానికి చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు ఒక్కటీ లేదని విమర్శించారు. కూల్చిన బతుకులు, కూల్చిన ఇండ్లు తప్ప మరేమీ లేవని అన్నారు.
చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బుల్లేవంటున్నాడని హరీశ్‌రావు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధు అడిగితే డబ్బుల్లేవంటాడని అన్నారు. గురుకులాల్లో అన్నం పెట్టక 162 మంది విద్యార్థులు చనిపోయారు.. అడిగితే రాష్ట్రం దివాలా తీసింది, నా దగ్గర పైసల్లేవు నన్ను కోసుకు తింటారా అంటాడని అన్నారు.
మరి పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో రూ. 100 కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ. 5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివి అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు 20,000 కోట్లు బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. పేదలకు ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డికి డబ్బులు ఉండవా? అని నిలదీశారు.