Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ఓజీ’ సినిమాతో అభిమానుల ఆకలి తీర్చిన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీజనల్ సినిమాగా విడుదలై రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. కొన్నేళ్లుగా అభిమానులు పవన్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా ప్రెజెంట్ అవుతూ ఆయన మరోసారి తన మాస్ ఇమేజ్ను ప్రూవ్ చేసుకున్నారు. ‘ఓజీ’ విజయోత్సాహంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో ‘గబ్బర్ సింగ్’ కాంబో కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా తర్వాత పవన్ కొంతకాలం సినిమాలకు విరామం ఇస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫ్యాన్స్‌ను ఉత్సాహానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారిక అనౌన్స్మెంట్ రావడంతో షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని వార్తలు వినిపించాయి. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత-దర్శకుడు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, కథ లైన్ పవన్‌కు నచ్చినప్పటికీ, ఇటీవల ఇచ్చిన ఫైనల్ న్యారేషన్ ఆయనను పూర్తిగా మెప్పించలేదని టాక్. స్క్రిప్ట్ విషయంలో మరింత మెరుగులు దిద్దాలని, సమయం తీసుకున్నా బెస్ట్ అవుట్‌పుట్ రావాలనే ఉద్దేశంతో పవన్ సూచించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్‌లోకి వెళ్లినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ఓజీ’తో మాస్ హిట్ ఇచ్చిన తర్వాత వెంటనే మరో యాక్షన్ ప్రాజెక్ట్ వస్తుందని ఆశించిన అభిమానులు ఈ వార్తతో కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకపోవడం మంచి సంకేతమేనని, ఫైనల్‌గా ప్రాజెక్ట్ పట్టాలెక్కితే అది మరో భారీ ఎంటర్టైనర్గా మారే అవకాశముందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి సురేందర్ రెడ్డి కాంబో ఎప్పుడు ప్రారంభమవుతుంది? స్క్రిప్ట్ ఎలాంటి మార్పులతో వస్తుంది? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.