వరంగల్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న మహాసభ బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన సభల కంటే గొప్పగా ఉంటుందని చెప్పారు. లక్షలాదిగా వచ్చే ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను సమగ్రంగా చేయాలని, వసతుల విషయంలో రాజీపడొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నదని, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు జనం నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నదని చెప్పారు.
అన్ని వర్గాల వారు ఎల్కతుర్తి సభకు హాజరుకానున్నారని, ఈమేరకు మహాసభ వద్ద వసతులు కల్పించాలని సూచించారు. రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు, సభలో మహిళలకు ప్రత్యేక వసతులు, సభ విజయవంతంలో మహిళల భాగస్వామ్యం, సభ సక్సెస్ కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఎర్రవెల్లిలోని నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమీక్షించారు. సభా వేదిక, లక్షలాదిగా వచ్చే ప్రజలకు సభా స్థలంలో ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది వాహనాల్లో జనం రానున్నారని, పార్కింగ్ నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్, మాజీ ఎమ్మెల్యేలు ఒడితెల సతీశ్ కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చంద్రావతి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, రజినీ సాయిచంద్, జక్కు శ్రీహర్షిణి, కల్వకుంట్ల వంశీధర్‌రావు, నవీనాచారి, హరి రమాదేవి పాల్గొన్నారు.