అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక సారలమ్మ జాతరకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒకప్పుడు రోడ్లు సరిగా లేక సింగిల్ రోడ్లపై జాతరకు వెళ్లడం కష్టంగా ఉండేది. ట్రాఫిక్ జామ్తో చిన్న దూరానికి గంటలకొద్దీ సమయం పట్టడం వల్ల రోజంతా ప్రయాణం సాగేది. వన దేవతల గద్దెల పరిసరాల్లోనూ సౌకర్యాలు పెద్దగా ఉండేవి కావు. భక్తులకు తాగునీరు, స్నానాలు, మరుగుదొడ్లకు అవస్థలు ఉండేవి. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అంతా మారింది. నాలుగు జాతరలకు మొత్తం రూ.332కోట్లు వెచ్చించి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టడంతో ప్రయాణం సాఫీగా సాగుతుండగా.. భక్తులకు దర్శనం సులభమైంది. వన్ వే విధానంతో నిత్యం వేలాది మంది రాకపోకలకు వీలు కలిగింది.
మేడారం జాతరలో కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదిక పనులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి జాతరకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. అప్పటి అవసరాలను తీర్చడమే కాకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మేడారం జాతరకు వెళ్లేందుకు అనుగుణంగా వన దేవతల గద్దెల చుట్టూ ఐదారు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేశారు. జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేందుకు సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్ రోడ్లుగా అభివృద్ధి చేశారు. ఒకప్పుడు రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలోనే భక్తుల రద్దీ ఉండేది. ఇప్పుడు వసతులు పెరగడంతో ప్రతి సెలవు రోజులోనూ వేల మంది భక్తులు వన దేవతలను దర్శించుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేడారం జాతర అంటే కొంతమంది కోసమే అన్నట్లుగా పనులు జరిగేవి. ఎన్ని కోట్ల నిధులు ఖర్చు చేసినా తాత్కాలిక అవసరాల పనులు చేసేవారు. జాతర ముగిసిన వెంటనే ఆ పనులు ఎవరికీ కనిపించేవి కావు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో మొదటి జాతర జరిగింది. అప్పటినుంచి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టారు. అప్పటినుంచి 2018, 2020, 2022 జాతరలకు కలిపి కేసీఆర్ ప్రభుత్వం రూ.332 కోట్లతో అభివృద్ధి చేసింది. భక్తులు ఉండేందుకు వీలుగా మేడారం జాతర పరిసరాల్లో భారీ షెడ్లను నిర్మించారు. పలు ప్రాంతాలలో భారీ షెడ్లను నిర్మించారు. మేడారంలో ఐదు చోట్ల పెద్ద షెడ్లను, ఒక మినీ షెడ్డును నిర్మించారు. సారలమ్మ ఆలయం ఉండే కన్నెపల్లిలో మరో షెడ్డును నిర్మించారు. మేడారం జాతర నిర్వహణ కోసం దేవాదాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు వేర్వేరుగా గెస్టుహౌస్లను నిర్మించారు. ట్రైబల్ టూరిజం సర్క్యూట్లో భాగంగా మేడారం, తాడ్వాయిలో భక్తుల కోసం హరిత హోటళ్లను నిర్మించారు. ఇవి భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తులకు చక్కగా ఉపయోగడుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వంద కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో ఎక్కడా ట్రాఫిక్ జాం కావడం లేదు. రవాణాకు అవసరమైన విధంగా రోడ్ల నిర్మాణం చేయడంతోపాటు ట్రాఫిక్ సమస్యలకు కారణాలను విశ్లేషించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన మొదటి జాతరకు వరంగల్ నగరం నుంచి వన్ వే ట్రాఫిక్ పద్ధతిని అమలు చేశారు. మేడారం జాతరకు ఏ వైపు నుంచి వచ్చినా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ విధానం బాగా ఉపయోగపడుతున్నది.
సౌకర్యాలు ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నాలుగు జాతరలలో 320 కేంద్రాల్లో 6400 మరుగుదొడ్లను నిర్మించారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద భక్తులు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు. పారిశుధ్య నిర్వహణ కోసం నాలుగు వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించి మేడారం పరిసరాలను నిత్యం శుభ్రంగా పెట్టారు. 100 ట్రాక్టర్లు, 20 టాటా ఏస్ వాహనాలు, ఎనిమిది జేసీబీలతో నిత్యం చెత్తను తొలగించారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ఇంగ్లిష్ మీడియం సూల్లో, టీటీడీ కల్యాణ మండపం వద్ద పూర్తి స్థాయి దవాఖానలను ప్రారంభించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో 19 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. భక్తులు మేడారం చేరుకునే ఎనిమిది మార్గాలలో 42 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం 15 అంబులెన్సులు, 8 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ 51 రూట్ల నుంచి 3845 బస్సులను నడిపింది. మేడారంలో 50 ఎకరాల్లో బస్టాండ్ నిర్మాణం చేపట్టింది. జాతరలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు పోలీసు శాఖ 10,300 మంది సిబ్బందితో విధులు నిర్వర్తించింది. సౌకర్యాలు, వసతుల పరంగా మేడారం జాతరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.