ఆంధ్రా పాలనలో ప్రభుత్వ పథకాలంటే అందని ద్రాక్షే. కానీ స్వరాష్ర్టాన కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు తీరొక్క పథకం అందుతున్న తీరు లబ్ధిదారుల కుటుంబాల్లో చెప్పలేని ఆనందం కలిగిస్తున్నది. నాడు ఒక కుటుంబంలో ఒక్కరికే దిక్కు లేని పరిస్థితి నుంచి నేడు ఇద్దరు, ముగ్గురు, నలుగురికి సైతం రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, సీఎంఆర్ఎఫ్, రైతుబీమా.. ఇలా మరెన్నో రూపాల్లో సర్కారు సాయంగా నిలుస్తుండడంపై సగటు తెలంగాణ బిడ్డలు గర్వపడుతున్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనని, ఉద్యమ నేత ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏ తీరుగ మేలు జరుగుతున్నదో కళ్లారా చూస్తున్నామనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాకేంద్రానికి చెందిన రైతు ఒజ్జల లింగయ్య నాలుగేళ్లలో రూ.5లక్షలు (రైతుబంధు-రూ.4.50 లక్షలు, కల్యాణలక్ష్మి-రూ.51వేలు) అందుకొని మురిసిపోతున్నాడు. త్వరలో మరో కూతురి పేర రూ.లక్షా నూట పదహార్లు వస్తాయని సంబురంతో చెబుతున్నాడు.
– ములుగు, మే 5(నమస్తేతెలంగాణ)
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోవడమే కాకుండా వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి. ఇందుకు ములుగు జిల్లాకేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబమే ఉదాహరణ. జిల్లాకేంద్రానికి చెందిన ఒజ్జల లింగయ్య అనే రైతుకు వ్యవసాయంలో, అటు ఆడపిల్లల పెండ్లి సమయంలో ప్రభుత్వ పథకాలు భుజాన ఉన్న బరువును దించేలా చేశాయి. గడిచిన నాలుగేళ్లలో ఈ రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల సాయం అందగా కల్యాణలక్ష్మి పథకం కింద మరో రూ.లక్షా116 సాయం త్వరలో అందనున్నది. 10 ఎకరాల భూమిని కలిగి ఉన్న లింగయ్య రైతు బంధు సాయంతో పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. లింగయ్య పేరు మీద 6 ఎకరాల 27గుంటలు, అతడి భార్య స్వరూప పేరు మీద 3 ఎకరాల 13గుంటల పొలం ఉంది. మొత్తం కలిపి రూ.50వేల పెట్టుబడి సాయం ప్రతిసారి అందుతూ అతడిని వ్యవసాయంలో వెనుదిరిగి చూడకుండా చే స్తోంది. సర్కారు ఇచ్చే పెట్టుబడి సాయంతో లింగయ్య ఇటు వరి, పత్తిలో దిగుబడి సాధిస్తూ లాభాల పంట పండిస్తున్నాడు. ఇద్దరు ఆడబిడ్డలు ఉండగా ఐదేళ్ల క్రితం పెద్ద బిడ్డ రజిత పెండ్లి చేయగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేలు ఇచ్చింది. ప్రస్తుతం ఆరు నెలల క్రితం చిన్న బిడ్డ అవంతికకు పెండ్లి చేసి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేశాడు. ఈ సాయం త్వరలో లింగయ్య కుటుంబానికి అందనున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో తన లాంటి రైతులకు, నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో సాయం అవుతుందని చెబుతున్నాడు. ఇదివరకెన్నడూ ఇంత మంచి పాలన చూడలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల అవసరాలను గుర్తించి వారి కుటుంబబాధ్యతలను సైతం భుజాన వేసుకోవడాన్ని రాష్ట్రంలోని ప్రజలు మెచ్చుకుంటున్నారని లింగయ్య సంతోషంతో చెప్పాడు.
పూర్తిగా రైతును అయిన నాకు సీఎం కేసీఆర్ సారు అందిస్తున్న పథకాలు అండగా నిలిచాయి. రైతుబంధు పథకం మొదలైనప్పటి నుంచి నాకున్న 10 ఎకరాల పొలానికి పెట్టుబడి సాయం అందుతాంది. నా భార్య పేరు మీన 3ఎకరాల 13గుంటలు, నా పేరు మీద 6ఎకరాల 27 గుంటలు ఉంది. వానకాలం, యాసంగి పంటలు వేసేందుకు డోకా లేకుండా పైసల్ పడ్తున్నయ్. 24గంటల కరంట్ ఉండడం వల్ల పంటకు నీళ్ల రంది లేదు. రాబడి మంచిగనే ఉంది. నా పెద్దబిడ్డకు కల్యాణలక్ష్మి అండగా నిలిచింది. గప్పుడు రూ.51వేలు వచ్చినయ్. నా చిన్నబిడ్డ పెండ్లి ఈ మధ్యల్నే చేసిన. కల్యాణలక్ష్మి కోసం అర్జీ పెట్టిన. అవి రూ.లక్షా 116 వస్తయ్. చాలా సంతోషంగా ఉంది. బిడ్డల పెండ్లిల్లకు కల్యాణలక్ష్మి పథకం పెద్ద దిక్కు అయింది. నాకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు బీటెక్ సదువుతున్నడు. పంటలు పండించే దాంట్లో వచ్చిన లాభాలతో బిడ్డల పెండ్లిలు చేసిన. ఇప్పటివరకు ఎవరినీ చేయి చాపకుండా సంతోషంగా ఎవుసం చేసుకుంటానం.
– ఒజ్జల లింగయ్య, ములుగు