ధర్మారం/ రామడుగు/ మల్యాల/మెట్పల్లి, మార్చి 3 : గోదావరి జలాలు ఎగువకు ఎదురెక్కుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి. లింక్-2లో ఐదు రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతుండగా, ఒక్కో పంపుహౌస్ నుంచి ఎగువకు పయనిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలంలోని నంది పంప్‌హౌస్‌కు సొరంగాల ద్వారా వచ్చిన నీటిని ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పంపింగ్ చేసి ఆ తర్వాత నిలిపి వేస్తున్నారు. మంగళవారం 2, 7 నంబర్ల మోటర్లను నడిపించి, 3,150 క్యూసెకుల చొప్పున 2 మోటార్ల ద్వారా 6,300 క్యూసెక్కల జలాలను నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయిస్తున్నారు.
అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు వస్తుండగా, అక్కడి 2, 4 మోటర్ల ద్వారా ఎత్తిపోస్తూ అప్రోచ్ కెనాల్ ద్వారా వరద కాలువకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్‌కు ఎదురెక్కుతుండగా, అక్కడ మోటర్లను ఆన్ చేసి 7,250 క్యూసెక్కుల నీటిని ఎగువకు పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్ వైపు గోదావరి నీళ్లు తరలుతున్నాయి. అక్కడ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూడు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగాయి. ఒక్కో మోటర్ ద్వారా 1450 క్యూసెక్కుల చొప్పున మొత్తం 0.07 టీఎంసీల నీటిని వరదకాలువ ఎగువ ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.