వేములవాడ, మార్చి 3 : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధాగ్ని రగులుతున్నది. నాలుగు రోజులుగా బాంబుల వర్షం కురుస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ యుద్ధ విమానాలతో దాడి చేస్తుండడం భయాందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం మన రాష్ట్రం నంచి వెళ్లిన లక్షలాది మంది దుబాయి, సౌదీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ తదితర దేశాల్లో చిక్కుకుపోగా.. ఇక్కడ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా దాడులు జరుగుతుండడం, అందుకు సంబంధించిన వార్తలు బయటికి వస్తుండడంతో భయపడిపోతున్నారు.
ఎప్పుడు ఏ సమాచారం వినాల్సి వస్తుందోనని కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తమ వాళ్లకు ఫోన్లు చేస్తూ ఆరా తీశారు. మంగళవారం వేములవాడలో పదుల సంఖ్యలో కుటుంబాలు ఒక దగ్గరికి చేరి, గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ వాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. వీడియో కాల్ ద్వారా, ఫోన్ల ద్వారా క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అయితే రాత్రీ పగలు తేడా లేకుండా బాంబుల దాడులు జరుగుతున్నాయని, తాము బయటికి రావడం లేదని, అకడి ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదురొంటున్నాయని తమ వాళ్లు చెబుతున్నా కుటుంబసభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనసు నుంచి భయం పోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే తమ వాళ్లను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు.
నా భర్త పదమూడేళ్లుగా ఒమన్ దేశానికి వెళ్తున్నడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నరు. నేను కూడా ఎనిమిది నెలలు అకడ ఉండి వచ్చిన. దుబాయ్ సరిహద్దులో నా భర్త మహేశ్ ఉద్యోగం చేస్తున్నడు. ఇటీవలే ఆ ప్రాంతంలో పడిన బాంబుతో ఇద్దరు గాయపడ్డారని టీవీలో చూసిన. మస్తు భయం అవుతున్నది. మాకు దుఃఖం ఆగడం లేదు. అందరినీ క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాలను వేడుకుంటున్న.

నా ఇద్దరు కొడుకులు రవీందర్, విక్రమ్ దుబాయిలోనే ఉన్నరు. వాళ్లు మాకు ఫోన్ చేసి బాగానే ఉన్నామని చెబుతున్నరు. కానీ, టీవీల్ల వచ్చే వార్తలు చూసి చాలా భయపడుతున్నం. ఫోన్లో వచ్చే వీడియోలను చూస్తే మాకు ధైర్యం చాలడం లేదు. వీలైనంత తొందరగా ఇకడికి రప్పిస్తే సర్కారుకు రుణపడి ఉంటం.
నా భర్త ఎల్లయ్య ఖతర్‌లో ఉద్యోగం చేస్తున్నడు. అమెరికా సైన్యం స్థావరాలు ఉన్న చోట బాంబులు వేస్తున్నరని, మాకు ఏమీ ఇబ్బంది లేదని, ఇంట్లో నుంచి బయటకు రావడంలేదని ఫోన్ చేసి చెబుతున్నడు. కానీ, టీవీలో వచ్చే బాంబు దాడుల వార్తలను చూస్తే భయంగా ఉన్నది. రోజూ ఫోన్ మాట్లాడుతున్నా ధైర్యం చాలడం లేదు. క్షేమంగా ఇంటికి రావాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నం.
మా ఆయన గంగాధర్ షార్జాలో ఉంటడు. ప్రతి ఏడాది మేలో వస్తుంటడు. ఈ సారి కూడా రావడానికి సిద్ధమైండు. కానీ, గల్ఫ్‌దేశాల్లో యుద్ధంతో రాలేని పరిస్థితి ఉన్నది. షార్జాలో పరిస్థితి చాలా భయంకరంగా ఉందట. తినడానికి కూడా ఏమీ దొరకడం లేదట. బాంబుల మోతతో నిత్యం కంటిమీద కునుకు లేకుండా భయం భయంగా గడుపుతున్నరట. పరిస్థితులు భయంకరంగా ఉన్నందున క్షేమంగా మా ఆయనను ఇంటికి చేర్చాలని అధికారులను వేడుకుంటున్న.