ఆధునిక మహాభారతంలో పశుపర్వంగా చేర్చిన గొరిల్లా కావ్యం
సముద్రం మొరగదనటం స్వాభిమాన చిహ్నం. పర్వతం వంగదనటం ఆత్మగౌరవ ప్రతీక. వెరసి, తుఫాను చిత్తం అనటం ఎరగదనటం, నియంత్రణకు అతీతమైన శక్తి. రా సోదరా! అనే పిలుపు కేవలం ఆహ్వానం కాదు; ఒక విప్లవ సమూహ నిర్మాణం.
ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవాత్మక స్వరాన్ని సృష్టించిన మహత్తర కవుల్లో గుంటూరు శేషేంద్ర శర్మ ఒకరు. 1975-77 ఎమర్జెన్సీ కాలం, నిజంగా ఒక అంధకాలం. వ్యక్తిగత, పత్రికా స్వేచ్ఛ లుప్తమైపోయిన కాలం. అప్పట్లో విప్లవ కవి శ్రీశ్రీ కూడా ఇందిరమ్మ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకానికి భజన చేస్తూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో కవితలు ప్రచురించారు. అటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తెలుగులో వచ్చిన ఏకైక కవితా సంపుటి శేషేంద్ర శర్మ గొరిల్లా. ఈ సంపుటిలోని కవితలు ఆ రెండు సంవత్సరాల్లో ప్రసిద్ధ దిన, వారపత్రికల్లో వచ్చినవే. రేడియో ప్రసారం కూడా అయినవే. ఫలితంగా ఆయన నిర్బంధ పదవీ విరమణకు కూడా గురయ్యారు.
శేషేంద్ర నిర్మించిన ‘ఆధునిక మహాభారతం’, సాంప్రదాయ మహాభారతంతో పోలిక లేని కొత్త భావనాత్మక విశ్వం. వ్యాసభారతం యుద్ధ గాథ అయితే, శేషేంద్ర మహాభారతం మన సమకాలీన భారతదేశం-దాని సంఘర్షణలు, దాని వ్యథ, దాని జ్వాలలు. ఈ మహాకావ్య నిర్మాణంలో భాగమైన పశుపర్వం ‘గొరిల్లా’ కవిత, కేవలం ఒక ప్రతీక కాదు; మనిషిలో నిద్రిస్తున్న ఆత్మబలానికి, విప్లవస్ఫూర్తికి, ధైర్యానికి ప్రతిరూపం.
1976లో వెలువడిన ‘గొరిల్లా’ కావ్యం స్వర్ణోత్సవాన్ని చేరుకోవటం, కాల గౌరవంతోపాటు, ఒక ఆలోచనకు వచ్చిన చారిత్రాత్మక స్థిరత్వంగా భావించాలి. గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు చాలావరకు తక్షణ స్పందనలుగా కనిపిస్తాయి. కానీ అవి కాలపరీక్షను తట్టుకుని నిలబడిన అపురూప గ్రంథాలు. స్వర్ణోత్సవ వేడుక-ఒక కవిత కాలంతో పోరాడి నిలబడిన గుర్తింపు; ఒక భావజాలం తరతరాలకు చేరువవుతున్న సంకేతం. ఈ సందర్భంలో ‘గొరిల్లా’ను స్మరించటమంటే, మనలో నిద్రిస్తున్న క్రియాశక్తిని మేల్కొల్పటమే! మానవ చైతన్యం, తిరుగుబాట్లకు శాశ్వతమైన పిలుపు-లే గొరిల్లా!-1976లో ఎంత సజీవంగా ఉందో, ఇప్పటికీ అంతే సజీవం.
‘గొరిల్లా’ నాలుగు సర్గలుగా విభజించిన కావ్యం. ప్రతి సర్గ ఒక అంతరంగ దశను, ఒక సామాజిక-మానసిక పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. స్థూలంగా మొదటి సర్గ-అవగాహన, విప్లవ చైతన్యం. రెండో సర్గ-ఏకీకృత ‘కరుణ-హింస’-సామాజిక వాస్తవం. మూడో సర్గ-ఆత్మబలం, సామూహిక చైతన్యం. నాలుగో సర్గ-తుదిమేల్కొలుపు;
ఎలాగో చూద్దాం… మానవత నూతన యుగ ద్వార తీరాలు చేరింది…అంటూ, శేషేంద్ర మానవ చరిత్రలో ఒక కీలక మలుపును సూచిస్తారు. ఇక్కడ ‘గొరిల్లా యుగం’ అనేది పశుత్వానికి పిలుపు కాదు; అణచివేతకు ఎదురునిలిచే అసలు శక్తి. విప్లవ చైతన్యం ఉదయం, మొదటి సర్గ.
‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు’
సముద్రం మొరగదనటం స్వాభిమాన చిహ్నం. పర్వతం వంగదనటం ఆత్మగౌరవ ప్రతీక. వెరసి, తుఫాను చిత్తం అనటం ఎరగదనటం, నియంత్రణకు అతీతమైన శక్తి. రా సోదరా! అనే పిలుపు కేవలం ఆహ్వానం కాదు; ఒక విప్లవ సమూహ నిర్మాణం.
రెండో సర్గలో శేషేంద్ర అత్యంత విభిన్నమైన భావనను ప్రతిపాదిస్తారు: ‘గొరిల్లాలో రాక్షసుడు కరుణామయ రాక్షసుడు. అకలుషిత రాక్షసుడు. తనకు మానవతా నిర్మాణ శిల్పమే ధ్యేయం. తన మార్గానికి ద్రోహులు అడ్డు వచ్చినప్పుడే చూపిస్తాడు తన రెండో ముఖం అమలిన హింస. పవిత్రహింస! ‘ఇది విరోధాభాసం కాదు-ఇది సత్యం. ఇక్కడ రాక్షసత్వం, ఎదురులేని తిరుగులేని శక్తి. కరుణ, దాని దిశానిర్దేశం. ‘పవిత్రహింస’ అనే భావన ముఖ్యమైనది. ఈ హింస, విధ్వంసం కోసం కాదు; నిర్మాణం కోసం అవసరమైన ప్రతిఘటన. నా మాటలు ఈ దేశపు మట్టిలో చల్లుతున్నా అన్నిచోట్లా కత్తులు మొలవాలని- కవి మాటలే ఆయుధాలుగా మారాలని కోరుకునే ఆవేశం, మానవతా రాక్షసత్వం.
‘మీ చేతులు మీ స్వర్గం నిర్మించే శక్తి పొందాలనీ, మీ గుండెలు ధైర్యపు కండలు తొడుక్కోవాలనీ, మీ దేహాల్లో గొరిల్లా మీ మస్తిష్క శిఖరాలకు పెరగాలనీ ఆశీర్వదిస్తున్నాను-పదండి!’మీ చేతులు, మీ స్వర్గం, మీ గుండెలు, మీ దేహా లు… మీ, మీ-గొరిల్లా ఒక వ్యక్తి కాదు; ప్రతి వ్యక్తిలో పెరిగే చైతన్యం. ఎలాగంటే, చేతులు శ్రమకీ, గుండెలు ధైర్యానికీ, మస్తిష్కం దిశానిర్దేశానికి చిహ్నాలు. కీలకమైన మరో చిహ్నం ఉన్నది- సిగ్గు నాగరికతకు చిహ్నం. లోతైన ఈ భావానికి తోడుగా ‘స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన రక్తాన్ని గుర్తించనివాడు నిజానికి బానిసత్వాన్ని ఎంచుకున్నవాడే‘నని కవి తీవ్రంగా హెచ్చరిస్తారు. ఈ విధంగా మూడో సర్గలో జనచైతన్యాన్ని ప్రేరేపిస్తారు.
ఇక నాలుగో సర్గ, తుదిమేల్కొలుపు. ఈ సర్గలో కవి నేరుగా నిద్రిస్తున్న మనిషిని ప్రశ్నిస్తాడు:
‘తెలుసా నీ వ్యాధి ఏమిటో? బ్రతుకు దానికి మందేమిటి? మెతుకుదాని లక్షణమేమిటి? ఒక్కటనీకు ఆకలి వేసినప్పుడే నీవు మనిషివన్న జ్ఞాపకం నీకొస్తుంది’
ఇక్కడ ఆకలి చాలా కీలకమైన ప్రతీక. అది మామూలు ఆకలి కాదు; అస్తిత్వపు తవ్వకం. ఇక్కడే గొరిల్లా ఒక ప్రతీకగా పూర్తిగా వికసిస్తుంది: నిద్రలే గొరిల్లా!-మనిషి అంతరంగ శక్తికి పిలుపు. ప్రళయ ప్రభంజనం-మార్పు తీవ్రత; హోమాగ్ని-త్యాగం ద్వారా పునర్నిర్మాణం. ఈ చివరి పిలుపు అత్యంత శక్తివంతమైనది- అవతరించు గొరిల్లా! అగ్ని చల్లారిపోతోంది-ఇదొక హెచ్చరిక-మానవతలోని అగ్ని చల్లారకముందే మేల్కొనాలి. మొత్తానికి ‘గొరిల్లా’యే ఒక గొప్ప ప్రతీక. పశుత్వం కాదు; హింస కాదు; క్రూరత్వం అసలే కాదు. అది అణచివేతకు ప్రతిఘటన. ఆత్మగౌరవంతో సమూహ చైతన్యం ఉరకలెత్తిస్తూ మానవతను రక్షించే శక్తి.
నీషే వ్యక్తిగత భావనతో కొంత పోలిక ఉన్నా, శేషేంద్ర దృష్టిలో అదొక సామూహిక మానవోదయం. నీషే వ్యక్తిగత పరిణామాన్ని కోరితే, శేషేంద్ర ‘గొరిల్లా’ ప్రతీకతో సామూహిక చైతన్యాన్ని కోరుకున్నారు. అయితే ఇద్దరిలోనూ మూలం ఒకటే: మనిషిలో నిద్రిస్తున్న అణగారిన శక్తిని మేల్కొల్పటమే! ఆధునిక మహాభారత కావ్య నిర్మాణంలో గొర్రిల్లా అనే పశుపర్వం ఒక కీలక ఘట్టం. ‘జ్యోత్స్నాపర్వం’ చైతన్యపు ప్రతిపాదనైతే, ‘ప్రజాపర్వం’ సమాజ ప్రతిబింబం. ‘సూర్యపర్వం’ శక్తికి కేంద్రం. ఇక ‘పశుపర్వం’ అంతరంగ శక్తికి మేల్కొలుపు. మానవుడు తనలోని అసలు శక్తిని గ్రహించేలా ప్రేరేపిస్తుంది.
గొరిల్లా మనిషిలోని నిద్రిస్తున్న అగ్ని, నిశ్శబ్ద గర్జన, అణచివేతకు ఎదురునిలిచే శక్తి. మనలోని గొరిల్లా నిద్రలోనే ఉన్నదా? లేదా మేల్కొనే దశకు చేరుకున్నదా?-ఇదీ గొరిల్లా కావ్యం లేవనెత్తే ప్రశ్న. ఒక యుగ చైతన్యానికి సంకేతం. ‘గొరిల్లా’ తత్త్వం శేషేంద్ర కవిత్వంలో అత్యంత సంక్లిష్టమైన, విప్లవాత్మకమైన భావ నిర్మాణం. గొరిల్లా బయట ఉన్న జంతువు కాదు-మనిషిలో నిద్రిస్తున్న ఆత్మగౌరవ శక్తి; ప్రతిఘటన శక్తి; సృజనాత్మక విధ్వంసం-‘కరుణామయ రాక్షసుడు’ పురాణార్థంలోని రాక్షసుడు కాదు. రాక్షసత్వమంటే ఏకదీక్షతో కూడిన కార్య నిమగ్నత, శక్తి తీవ్రత-అదీ కరుణామయం. మానవతా దిశగా సాగే నిర్మాణాత్మక హింస.
అది అన్యాయాన్ని ఎదుర్కొనే హింస; మానవతను కాపాడే దయ-పవిత్ర హింస భావన. అది ప్రతీకారం కాదు; దురుద్దేశపూరితమైన హింస కాదు. సమాజ శుద్ధి కోసం అవసరమైన ప్రతిఘటన; దోపిడీ నిర్మూలన కోసం శక్తి వినియోగం. ఆనాటి మహాభారత యుద్ధం మాదిరిగా ధర్మయుద్ధానికి ఆధునిక రూపం. మీ చేతులు మీ గుండెలు అనటంలోని భావం, గొర్రిల్లా ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి: వ్యక్తి కాదు, ప్రజలు ప్రధానం; నాయకుడు కాదు, చైతన్య నాయకత్వం కావాలి.
నీకు ఆకలి వేసినప్పుడే అనే పంక్తి గొరిల్లా తత్త్వానికి కేంద్రభావం. ఆకలి, శరీర అవసరం కాదు; న్యాయం కోసం పోరాటం. గౌరవం కోసం ఆరాటం. గొరిల్లా మేల్కొలుపు అవసరంతో ప్రారంభమై, చైతన్యంతో పరిపక్వమవుతుంది. శేషేంద్ర ‘గొరిల్లా’లో చేసిన ప్రయోగం తెలుగు కవిత్వంలో విప్లవాత్మకం. గొరిల్లా అనే ప్రతీక, సాంప్రదాయ సౌందర్యాన్ని చెరిపేసింది. కొత్త భాషను సృష్టించింది. ఈ కవితలో ఛందస్సు లేదు. కానీ ఒక అంతర్గత లయ ఉన్నది; పిలుపు లయ, ఆవేశపు లయ, ఉద్యమ లయ.
నా మాటలు కత్తులై మొలవాలి పదం చర్యగా కవిత ఒక ఆయుధం. సాహిత్యాన్ని పాఠ్యంగా కాకుండా ప్రయోగాత్మక శక్తిగా మార్చింది. పాఠకుని పాత్రలో మార్పు గమనీయం. సాంప్రదాయ కవిత్వంలో పాఠకుడు కేవలం అప్పుడప్పుడు వీక్షకుడుగా మారగలడేమో! అంతకుమించిన పాత్ర పాఠకుడికి ఉండదు. గొరిల్లా కవితలో పాఠకుడు భాగస్వామిగా మారతాడు. యోధుడవుతాడు. ఎందుకంటే, రా సోదరా! అనే పిలుపు, పాఠకుడిని నేరుగా కవితలోకి లాగుతుంది. గొరిల్లా కావ్యానికి ఇప్పటికీ సమకాలీన ప్రాముఖ్యత, ప్రాసంగికత ఉన్నాయి. ఎందుకంటే సామాజిక అసమానతలో అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ లేదు. పైగా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అణచివేత ఇంకా అలాగే ఉన్నది. దానికి అనుగుణంగా, అనుబంధంగా సామాజిక వివక్ష ఇంకా ఉన్నది. అందుకే గొరిల్లా పిలుపు ఇంకా వినిపిస్తూనే ఉన్నది…ఉంటుంది.
– మాకినీడి సూర్యభాస్కర్ 9491504045