ChatGPT : ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. జూలై 25, శనివారం మధ్యాహ్నం నుంచి ఈ పరిస్తితి తలెత్తింది. మధ్యాహ్నం 2.54 గంటల నుంచి ఈ పరిస్థితి ఎదురవుతోందని నెటిజన్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇటు వెబ్ ఇంటర్ఫేస్లోనూ, అటు మొబైల్ అప్లికేషన్లోనూ అనేక సేవలు పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
లాగిన్ అవ్వడం లేదని, చాట్స్ సెక్షన్ పనిచేయడం లేదని, యాప్‌పై పూర్తిగా యాక్సెస్ చేయలేకపోతున్నామని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి యాప్, నెట్ సేవలు డౌన్ అయితే, ఆ వివరాల్ని డౌన్‌డిటెక్టర్ నమోదు చేస్తుంది. ఈ సంస్థ గుర్తించిన వివరాల ప్రకారం.. నార్మల్ ఆపరేషన్‌కు సంబంధించి 2 బేస్‌లైన్ రిపోర్ట్‌లను గుర్తించింది. నిమిషాల వ్యవధిలో వందలకొద్దీ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌తోపాటు డెవలపర్ ఏపీఐలలోనూ, వెబ్‌లోనూ ఈ చాట్‌జీపీటీ పని చేయడం లేదు. స్థానిక నెట్‌వర్క్‌లో సమస్యలకంటే.. సంస్థకు చెందిన గ్లోబల్ సర్వర్లలో సమస్య ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా, బ్రిటన్‌లోనూ చాట్‌జీపీటీ సేవలు నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని చాట్‌జీపీటీ నిర్వహణా సంస్థ ఓపెన్ఏఐ కూడా ధృవీకరించింది. ఎలివేటెడ్ ఎర్రర్ రేట్స్ కింద ఈ సమస్యను పరిగణిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు సంస్త ప్రకటించింది. ఇటీవల కూడా చాట్‌జీపీటీలో ఇమేజ్ జనరేటర్ సమస్య ఏర్పడింది. దీన్ని కొన్ని గంటల్లోనే సంస్థ పరిష్కరించింది.