వరంగల్, నవంబర్ 28 : వలస పాలకుల చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించడానికి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29 చేపట్టిన దీక్ష సమస్త తెలంగాణను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అదే ‘దీక్షా దివస్’గా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి పోయింది. కనీవినీ ఎరుగని రీతిలో సబ్బండ జాతులను ఏకం చేసి మలిదశ ఉద్యమం ఉగ్రరూపం దాల్చేలా చేసిన దీక్షకు గుర్తుగా వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఆవరణలో దీక్షా దివస్ పైలాన్‌ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, కార్పొరేటర్‌గా ఉన్న జోరిక రమేశ్ ఆనాడు కౌన్సిల్ సమావేశంలో దీక్షా దివస్ గుర్తుగా బల్దియా అవరణలో పైలాన్ ఏర్పాటు చేయాలని తీర్మా నాన్ని ప్రవేశ పెట్టగా, అప్పటి మేయర్ గుండా ప్రకాశ్‌రావు ఆమోదం తెలిపి రూ. 10 లక్షల నిధులు కేటాయించారు. బల్దియా ఆవరణలో ఫిబ్రవరి 7, 2021న ఆనా డు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా దీక్షా దివస్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అదేవిధంగా దీక్షా స్ఫూర్తి చిహ్నంగా బల్దియా ఆవరణలో ఏర్పాటు చేసిన ‘బిగించిన పిడికిళ్లు’ ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంటాయి. పైలాన్‌పై ఒక వైపు ఉద్యమ నేత కేసీఆర్.. మరో వైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం వద్దకు రాగానే ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.
స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ నిరాహార దీక్ష భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే సంకల్పంతోనే బల్దియా ఆవరణలో పైలాన్ ఏర్పాటు చేయాలని ఆనాడు కౌన్సిల్లో తీర్మానం ప్రవేశ పెట్టాను. దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం ఏర్పాటు కమిటీకి కన్వీనర్‌గా పనిచేశాను. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా బిగించిన పిడికిళ్లు, బానిస సంకెళ్ల నుంచి రాష్ర్టాన్ని విముక్తి చేసిన ఉద్యమ నేత కేసీఆర్ చిత్రం, సాధించిన తెలంగాణ రాష్ట్ర చిత్రంలో పైలాన్‌ను రూపొందించాం. రాష్ట్రంలో ఏకైక దీక్షా దివస్ పైలాన్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఉండడం ఉద్యమ గడ్డ వరంగల్‌కు గర్వకారణం.
– జోరిక రమేశ్, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కార్పొరేటర్