బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అపర భగీరథుడు, హరితహారం సృష్టికర్త కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన కేసీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పబ్బతి పట్టారు. ఊరూరా కేక్‌లు కట్ చేయడంతో పాటు హరితహారం స్ఫూర్తితో వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి సెల్ఫీలు దిగారు. కేసీఆర్ విగ్రహం, చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పూలు, పాలతో అభిషేకం చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, హోమాలు చేశారు. అలాగే దవాఖానలు, బస్టాండ్లు, వృద్ధ, అనాథాశ్రమాలు, పాఠశాలల్లో పండ్లు, స్వీట్లు పంచి అన్నదానం, రక్తదానం చేశారు. పంట పొలాల్లో సంబురాలు జరుపుకొన్నారు. ‘కేసీఆర్ సారే కావాలి.. మళ్లీ కారే రావాలి’ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించి అభిమానం చాటుకున్నారు.
– నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 17
జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి, వర్ధన్నపేట మండల కేంద్రాల్లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. దేవరుప్పులలో మొక్కలు నాటడంతో పాటు కార్యకర్తలకు హెల్మెట్లు పంపిణీ చేసి బైక్ ర్యాలీ చేపట్టారు. పదేళ్లు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాజీపేట చౌరస్తాలో నిర్వహించిన వేడుకలకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హాజరయ్యారు. రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అని, తెలంగాణతో ఆయనది పేగుబంధమని అన్నారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో జరిగిన వేడుకల్లో నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. 72 కిలోల కేట్ కట్ చేయడంతో పాటు కేసీఆర్ భారీ కటౌట్‌కు పూలు, పాలతో అభిషేకం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఆనాడు మరింత ఘనంగా వేడుకలను జరుపుకొందామన్నారు.
ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని భాగ్యతండాలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతితో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. కల్యాణలక్ష్మి పథకానికి స్ఫూర్తిగా నిలిచిన కీమానాయక్, కుమార్తె కల్పన దంపతులకు కొత్త బట్టలు అందజేయడంతో పాటు గ్రామంలోని మహిళలందరికీ చీరెలు పంపిణీ చేశారు. కేసీఆర్ పేరును తుడిచివేయడం ఎవరి తరం కాదన్నారు. ఆత్మకూరు మండలకేంద్రంలో చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ బోగస్ హామీలు నమ్మి మోసపోయారని, మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. శాయంపేటలో జరిగిన వేడుకలకు గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, రాష్ట్ర ప్రజలకు ఆయనే శ్రీరామ రక్ష అన్నా రు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కేసముద్రంలో బానోత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని, కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు.