హనుమకొండ, జులై 11: ప్రతి ఇంజినీర్ నవాబ్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్‌ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను అనుసరించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంజినీర్ నవాబ్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ 148వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్తు భవన్లో ఆయన చిత్ర పటానికి సీఎండీ వరుణ్‌రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆలోచన సరళిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క ఇంజినీర్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించాలన్నారు.
ప్రణాళిక ప్రకారం సబ్ స్టేషన్ కట్టడాలలో నాణ్యత ప్రమాణాలను పాటించి, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. ప్రతి పనికి నిర్వహణ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల రూపకల్పన నవాబ్ ఆలీ ప్రతిభ అని అభివర్ణించారు. నవాజ్ జంగ్ పేరు మీద నిజామాబాద్ లోని ఆలీసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేశారని అన్నారు. హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్, జూబ్లిహాల్ డిల్లీలోని హైదరాబాద్ హౌస్ తదితర ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ప్రజల అవసరాలను తీర్చారని ప్రశంసించారు.
తెలంగాణ సమాజ వికాసానికి ఎనలేని కృషి చేసిన నవాబ్ జంగ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆసియా ఖండంలోనే నిజాం సాగర్ డ్యాం భిన్నమైన పద్దతిలో నిర్మించిన ఘనత కేవలం నవాబ్ ఆలీకి దక్కుతుందని అన్నారు. ఆయనను ఇప్పటికి స్మరించుకుంటున్నామంటే అందుకు ఆయన కట్టిన కట్టడాలే సజీవ సాక్షాలని కీర్తించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సి. ప్రభాకర్, సిఈలు బి. అశోక్ కుమార్, టి. సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు హన్, రవీంద్రనాధ్, వెంకటరమణ, ఆర్.చరణ్‌దాస్, జాయింట్ సెక్రటరి కె.రమేష్, కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం, జియంలు వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్, ఇంజనీర్స్, అకౌంట్స్, పి అండ్ జీ, ఆర్టిజన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.