వరంగల్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారసత్వ, చారిత్రక, సాం స్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా కేసీఆర్ ప్రభుత్వం వరంగల్‌లో తలపెట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. సకల హంగులతో సిద్ధమై ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తున్నది. గత నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావించగా, సీఎం రేవంత్‌రెడ్డి రాకపోవడంతో వాయిదా పడింది.
ఆ తర్వాత అక్టోబర్ 2న ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ సీఎం పర్యటన లేకపోవడంతో మళ్లీ వాయిదా పడింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో కాళోజీ కళా క్షేత్రం పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కంటే విశాలంగా వరంగల్ నగరంలోని కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మించారు. హనుమకొండ బస్టాండ్ సమీపంలోని కుడా మైదానంలో 4.25 ఎకరాల్లో కళాక్షేత్రం నిర్మాణం జరిగింది. ఈ భవనాన్ని 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో విభిన్నశైలిలో నిర్మించారు.
వరంగల్ నగరానికి మరింత శోభను అద్దేలా, సాంస్కృతిక కేం ద్రంగా ప్రతిష్ట పెంచేలా భవనం డిజైన్ ఉన్నది. నాలుగు అంతస్థుల సువిశాల భవనంలో 1500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియంను నిర్మించారు. మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్‌ను అత్యాధునికంగా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెండు మేకప్ రూములు, ఆర్ట్ గ్యాలరీలున్నాయి. గ్యాలరీని కూర్చొని చూసేందుకు వీలుగా ఫ్రీ ఫంక్షన్ లాబీని ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు హైకెపాసిటీ లిఫ్ట్‌లను బిగించారు.
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. అని రాయడంతోపాటు ఆచరించి జీవితాంతం తెలంగాణ కోసం పని చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో వరంగ ల్ నగరంలో కళా క్షేత్రం ఉండనున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలు 2014లో నిర్వహించిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో ‘కాళోజీ కళా క్షేత్రం’ నిర్మించాలని నిర్ణయించారు.
ఆయన జయంతి రోజైన సెప్టెంబర్ 9న కేసీఆర్ స్వయంగా వరంగల్‌కు వచ్చి భూమి పూజ చేశారు. మొదట రూ.15 కోట్లతో ఎకరంలోనే నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఆ మేరకు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో వరంగల్‌కు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని కాళోజీ కళా క్షేత్రం భవనం డిజైన్‌లో కేసీఆర్ మార్పులు చేశారు. హనుమకొండలోని కుడా మైదానం (పాత హయగ్రీవాచారి కాంపౌండ్)లో 4.25 ఎకరాల్లో నాలుగు అంతస్తులతో కళా క్షేత్రం నిర్మించేందుకు నిర్ణయించారు.
ఇందుకోసం రూ. 85.10 కోట్లు కేటాయించడంతో రాష్ట్రంలోనే అతి పెద్ద కళా క్షేత్రం భవన నిర్మాణం వరంగల్‌లో పూర్తయ్యింది. కాళోజీ కళా క్షేత్రం పనులను మొదట్లో సాంస్కృతిక, పర్యాటక శాఖకు అప్పగించగా, కరోనా కారణంగా మూడేండ్లు పనులు నెమ్మదిగా సాగాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 2022లో సమీక్షించి కుడా నిధులతో పనులు పూర్తి చేయాలని ఆదేశించడంతో అప్పటి నుంచి పనులు వేగంగా జరిగి ప్రస్తుతం సకల సౌకర్యాలతో ప్రారంభానికి సిద్ధమైంది.