హనుమకొండ, డిసెంబర్ 11 : వరంగల్, హనుమకొండ, కాజీపేట నగర ప్రజలు, జంతు ప్రియులను కాకతీయ జూ పార్కు అలరించనుంది. హంటర్ రోడ్డులోని జూపార్లోకి రెండు కొత్త జంతువులు, ఒక పక్షి ప్రత్యక్షం కానుంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త జంతువులు, పక్షులు సందర్శకులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. కొత్తగా హాగ్ డీర్, బార్కింగ్ డీర్ (దక్షిణ ఎరుపు రంగు జింక), లుటినో పార్కిట్ (పసుపు రంగు రామ చిలుక) ఉన్నాయి. వీటిని విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జువాలజికల్ పార్ నుంచి సోమవారం కాకతీయ జూపార్కుకు తీసుకొచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. త్వరలో వాటిని సందర్శకులకు ప్రదర్శించేలా ఎన్క్లోజర్లను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, జూపార్కు నుంచి కొండ గొర్రె, మూషిక జింక, అడవి పావురాలను విశాఖ పట్నంలోని ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కు తీసుకెళ్లి అకడి నుంచి ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద వీటిని తీసుకొచ్చారు.
కాకతీయ జూపార్కులో ఇప్పటికే ఉన్న పలు రకాల జంతువులు, పక్షులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రోజురోజుకూ జూపార్కుకు వచ్చే సందర్శకుల సంఖ్య సైతం పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. చిరుతపులి, ఎలుగుబంటి, నక, అడవి పిల్లి, చుకల దుప్పి, సాంబార్ దుప్పి, కొండ గొర్రె, మూషిక జింక, మనుబోతు, కృష్ణ జింక ఉన్నాయి. మొసళ్లు, తాబేళ్లు, నక్షత్ర తాబేళ్లు, గ్రీన్ ఇగ్వానా (తొండ), నాలుగు రకాల సరీసృపాలు, నిప్పు కోడి, రియా, నెమలి, తెల్ల నెమలి, నలుపు, తెలుపు హంసలు, ఎరుపు, బూడిద వర్ణపు అడవి కోళ్లు, లేడీ ఆమ్ రెస్ట్ ఫీసాంట్, ఎల్లో గోల్డెన్ ఫీసాంట్, రామచిలుక, పెద్ద రామచిలుక, లవ్ బర్డ్స్ లాంటి 26 రకాల పక్షులు, మూడు రకాల కొకాటైల్, మూడు రకాల అడవి పావురాలు, ఫాన్ తోక పావురాలు, డోవ్, సన్ కొనూర్, చెర్రి తల రామచిలుక, మెరూన్ తోక రామచిలుక, మీసాల రామచిలుక ప్రస్తుతం సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు అదనంగా మూడు రకాల క్షీరదాలు, ఒక రకం పక్షులు సైతం సందర్శకులను ఆకట్టుకోనున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.