
పల్లె ప్రగతితో జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నాగారం గ్రామం ముఖచిత్రం మారింది. వంద శాతం పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. విలేజ్ పార్క్‌లో 2వేల మొక్కలు నాటడంతో పచ్చదనం ఉట్టిపడుతోంది. వైకుంఠధామంలో అన్ని సౌలత్లు సమకూర్చారు. సెగ్రిగేషన్ షెడ్డులో ఎరువును సైతం తయారుచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లెప్రగతి’ పథకం గ్రామాల రూపురేఖలనే మార్చేసింది. దీంతో గ్రామాలు అద్దంలా మెరుస్తున్నాయి. ఈ కోవలోకే అబ్దుల్‌నాగారం వంద శాతం పల్లె ప్రగతి పనులను పూర్తి చేసుకుని ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి తమ గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నారు. విలేజ్ పార్కు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మించుకున్నారు. సెగ్రిగేషన్ షెడ్డులో ఎరువు తయారీ ప్రారం భించగా, పల్లెప్రకృతి వనంలో 2 వేల రకాల మొక్కలు నాటారు.
ప్రారంభానికి సిద్ధంగా..
రూ.12.60 లక్షలతో శ్మశానవాటిక, రూ. 2 లక్షలతో డంపింగ్ యార్డు, రూ. 2లక్షలతో పల్లె ప్రకృతి వనం నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామపంచాయతీకి అందించిన ట్రాక్టర్ ద్వారా నిత్యం ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నాయి. శ్మశానవాటికలో బర్నింగ్ బెడ్స్, దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరుగా గదులు, నీటి వసతి కల్పించారు.
2 వేల మొక్కల పెంపకం
పల్లెప్రకృతి వనంలో పూలు, పండ్లు, నీడనిచ్చే, ఔషధ రకాల 2వేల మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని వనంగా మారింది. ప్రజలు సేదతీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. చుట్టూ రక్షణ కోసం కంచెతోపాటు గేటు, వాకింగ్‌కు బాటలు ఏర్పాటు చేశారు. మొక్కలకు నీరు పట్టేందుకు బోరు సదుపాయం కల్పించారు. పూలు.. నూరువరాలు 70 , చైనా బాక్సు 70, జట్రోపా 70, రెడ్‌లైట్ ప్యూన్ 70, పండ్లు.. మామిడి 15, చింత 15, సపోట 15, ఇతర రకాలు.. క్రోనోకార్పస్ 100, వేరుమద్ది 100, పెద్ద ఆరె 100, టేకోమా 60, బూరుగు 300 మొక్కలు నాటారు.
వంద శాతం పనులు పూర్తి
గ్రామంలో పల్లె ప్రగతి పనులను వంద శాతం పూర్తి చేశాం. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులతోపాటు సొంత నిధులు ఖర్చు చేస్తున్నాం. గ్రామంలో సొంతంగా బోర్లు వేసి మోటర్లు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల కోసం రూ. 2.50 లక్షలు ఖర్చు చేశాం. ఆలయాల నిర్మాణాలకు రూ. 2 లక్షలిచ్చాం. మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ముందంజలో ఉంచుతాం.
ఎరువును తయారు చేస్తున్నాం
మండలంలో పల్లె ప్రగతి పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని గ్రామాల్లో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే వందశాతం పనులు పూర్తవుతాయి. అబ్దుల్‌నాగారం గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్డులో ఎరువును తయారీ చేస్తున్నాం.