‘తెలంగాణలో వేద నాదం ఎక్కడుంది? మీ ప్రాంతంలో తర్కమీమాంస శాస్ర్తాలకు చోటేది?’ఈ ప్రశ్నలకు సమాధానంగా శతాబ్దం కిందట ఓ వైతాళికుడు ప్రభవించారు. ఆయనే శాస్ర్తుల విశ్వనాథ శాస్త్రి. వేదవేదాంగాలలో అనితరమైన ప్రతిభ ఆయన సొంతం. శాస్త్ర విషయాలు ఆయనకు కరతలామలకం. చతురామ్నాయ పీఠాధిపతుల మన్ననలు అందుకున్న ధన్యజీవి. వేద విద్య పరివ్యాప్తికే జీవితాన్ని అంకితం చేసిన పుణ్యమూర్తి. అంతేనా, ‘మీ ప్రాంతంలో వేదానికి ఉనికేది?’ అన్న విమర్శలకు గజారూఢుడై సమాధానంగా నిలిచారు. వేద పాఠశాల నెలకొల్పి మన తెలంగాణలో వేద పతాక ఎగురవేశారు విశ్వనాథ శాస్త్రి. అభినవ విద్యారణ్యులుగా కీర్తి గడించారు. మన ప్రాంతానికి చెందిన వైతాళికుడి శత జయంతి సందర్భంగా ఆ పుంభావ సరస్వతి విశ్వనాథుని విజయ ప్రస్థానమిది.

మనిషి జీవన నౌకకు శాస్త్రం, ధర్మం అనేవి తెరచాప, చుక్కాని లాంటివి. వీటిని కాదని పడవ ప్రయాణం ప్రమాదానికి దారితీస్తుంది. శాస్ర్తాన్ని, ధర్మాన్ని విస్మరిస్తే.. మనిషి మనుగడ కూడా ప్రమాదంలోనే పడుతుంది. శాస్త్రం రాణించాలన్నా, ధర్మం నిలబడాలన్నా… వేదం పరిఢవిల్లాలి. ఆ వేదమే విశ్వనాథ శాస్త్రి జీవన నాదమైంది. తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా శివంపేట సమీపంలోని రత్నాపురంలో 1926 మార్చి 4 (క్రోధన నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ పంచమి)న గుండయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరి ముత్తాత శంకరశాస్త్రి శివంపేటకు తరలిరావడంతో ఆ ఊరే వీరి స్వగ్రామమైంది. మూడేండ్ల వయసులోనే విశ్వనాథశాస్త్రి తండ్రి కన్నుమూశారు. దీంతో మేనబావల దగ్గరే పెరిగారు. ఆనాటి లబ్ధప్రతిష్ఠులైన అధ్యాపకుల పర్యవేక్షణలో విశ్వనాథ శాస్త్రి వేద విద్య అభ్యసించారు.
సికింద్రాబాద్ మున్నాలాల్ సంస్కృత పాఠశాలలో సంస్కృతం చదివారు. తర్వాత మద్రాస్ చేరుకొని మైలాపూర్ సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అక్కడే ‘సాహిత్య శిరోమణి’ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వ్యాకరణ శాస్త్రంలో బీవోఎల్, వేదాంత శాస్త్రంలో బీవోఎల్ ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అఖిలభారత ఆయుర్వేద విద్యాపీఠం నుంచి ఆయుర్వేదాచార్య పట్టం పొందారు. మరోవైపు ఆధ్యాత్మికంగానూ ప్రస్థానం కొనసాగించారు. కరపత్ర స్వామిగా విఖ్యాతులైన శ్రీ హరిహరానంద స్వామి అనుగ్రహంతో ధర్మశాస్త్ర, పూర్వ మీమాంసాది శాస్ర్తాలను అధ్యయనం చేశారు. ఆయన నుంచి మంత్రదీక్ష పొంది కఠోర సాధన చేశారు. వీరి ధర్మపత్రి అనసూయమ్మ. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో దేవదత్త శర్మ మానస పుత్రుడు కాగా, మరో ఇద్దరు వేంకటేశ్వర శర్మ, వామన శర్మ.
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సంగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా చేరి కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్లో తాను చదువుకున్న మున్నాలాల్ సంస్కృత కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా, ప్రధానాచార్యులుగా పనిచేశారు. భాగ్యనగరంలోని వేదాంత వర్ధిని కళాశాలలో అద్వైత వేదాంత ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలను మరికొంతకాలం నిర్వహించారు. తిరిగి తమ స్వగ్రామమైన శివంపేట ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులుగా వచ్చారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్నీ పొందారు. కొంత కాలానికి తెలంగాణ సీమలో వేద విద్య పరిరక్షణ కోసం వైదిక పాఠశాల నిర్వహించాలనే సంకల్పంతో ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. శివంపేటలోని తమ స్వగృహంలోనే వేద పాఠశాల నెలకొల్పారు. విద్యార్థులకు ఉచిత భోజన వసతితో వేద విద్యను అందించారు. వేదాధ్యాపకులుగా ఆహితాగ్ని, జ్యోతిరాప్తోర్యామ యాజి పట్లూరి మాణిక్య సోమయాజుల వారిని నియమించారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసించి పండితులుగా రాణిస్తున్నారు.
వేదం, శాస్ర్తాలలో విశ్వనాథ శాస్త్రి ప్రతిభను గుర్తించిన శృంగేరి జగద్గురువులు వారిని తమ ఆస్థాన పండితులుగా గౌరవించారు. 1961 ప్రాంతంలో అష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంగా భాగ్యనగరంలోని పిల్ఖానా ప్రాంతంలో శృంగేరి జగద్గురువులు ప్రారంభించిన రుద్ర యాగంలో విశ్వనాథ శాస్త్రి ఆచార్యులుగా వ్యవహరించారు. యాగ నిర్వహణలో ఆయన ప్రతిభకు ముగ్ధులైన యాగ కర్తలు విశ్వనాథ శాస్త్రికి ‘గజారోహణ’ చేయడం ముదావహం. భాగ్యనగర వీధుల్లో వేద విద్వన్మూర్తికి ఇంతటి సత్కారం జరగడం చరిత్రలో అపూర్వమైన ఘట్టం. తన జీవితాన్ని వేద విద్యకు అంకితం చేసిన విశ్వనాథ శాస్త్రి 1985 మే 5న పరమపదించారు.
ఆయన సంకల్ప బలంతో ప్రస్తుతం శివంపేటలో ఆయన కుమారుడు వేంకటేశ్వర శర్మ బగళాముఖి శక్తి పీఠం నెలకొల్పారు. ధర్మ, శాస్త్ర, సాహితీ రంగాల్లో అపూర్వమైన కృషి నిర్వహించిన విశ్వనాథ శాస్త్రి శత జయంతి ఉత్సవాలను 2025 మార్చి 19 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రతినెలా ఒకచోట శతాబ్ది ఉత్సవ సభలు చేపట్టారు. శత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో శివంపేటలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
వేదంపై ఘనమైన ఆధిపత్యం ఉన్న విశ్వనాథ శాస్త్రి.. పద్య కవిత్వంలోనూ, అవధాన రంగంలోనూ ప్రతిభను కనబరిచారు. విద్యా విషయకంగా సాహిత్య శిరోమణి, వ్యాకరణ – వేదాంత పట్టాలతో పాటుగా మరెన్నో బిరుదులు పొందారు. మహాకవి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. ఆది శంకరులు అందించిన శ్రీ విష్ణు సహస్రనామ భాష్యానికి ‘నామ సహస్రి’ పేరుతో పద్యాలలో తెనుగీకరించారు. రాజోపచారా పూజ, మాండూక్యోపనిషత్తుల అనువాదంతోపాటు సంస్కృత భాషలో జ్యోతిర్మీమాంసా శత శ్లోకి అనే గ్రంథాన్ని రచించారు. వనదుర్గగా కరుణను కురిపించే ఏడుపాయల దుర్గాంబ క్షేత్ర మహాత్మ్యాన్ని వచన రూపంగా, సుప్రభాతాన్ని శ్లోకాలుగా రచించారు. మరెన్నో రచనలు చేశారు.
– మరుమాముల దత్తాత్రేయ శర్మ