Nagurla Venkateshwarlu | మొగుళ్లపల్లి, మార్చి 01 : అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు అరికాంతపు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోషన్ కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన పరామర్శించారు. రాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజు కుటుంబం సభ్యులతో కలిసి మాట్లాడారు. రైతు రాజు మృతికి సంబంధించిన కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రూ.5 వేలు ఆర్థిక సాయమందించారు.
ఈ సందర్భంగా నాగూర్ల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ పంటలకు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన రైతు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం, పాలకులు ఆదుకున్న పాపాన పోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఓట్లు వేసి గెలిపిస్తే.. హామీల పేరుతో పబ్బం గడుపుతూ ప్రజలకు శటగోపం పెడుతున్నారని విమర్శించారు.
అప్పులు తీర్చలేమనే బెంగతో..
పంట పొలాలకు సాగునీరు అందక, మిర్చి పంటకు గిట్టుబాటు మద్దతు ధర లేక ఎంతోమంది రైతులు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేమనే బెంగతో పురుగులమందు తాగుతూ, వ్యవసాయ భూముల వద్దనే ఉరివేసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతూ పిట్టల్లా రాలుతున్న ఆ కుటుంబాలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు.
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఇటీవల చనిపోయిన బండారి భీమయ్య కుటుంబాన్ని నాగుర్ల పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ మాజీ కొడారి రమేష్ , సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి , టౌన్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమల్ల రమేష్, ప్రధాన కార్యదర్శి ఎర్రబాటి మహేందర్, ఉపాధ్యక్షులు రంపిస రాజేందర్, లీడర్లు బొల్లెని రవికుమార్, బండారి బిక్షపతి, పడిదల జగ్గారావు, మోడీ రాజు, వనం రాజయ్య, అరికాంతపు అన్నారెడ్డి, దేవనూరి కుమార్ తదితరులు ఉన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు