భూపాలపల్లి : క్రీడలు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయని తాడిచర్ల బ్లాక్-2 పీవీఎన్ఆర్ ఓసీపీ పీవో బీవీ రమణ అన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఏరియా స్థాయి గనులు, డిపార్ట్మెంట్ల స్థాయి స్పోర్ట్స్ క్యాలెండర్ను విడుదల చేశారు. అనంతరం ఫుట్బాల్ క్రీడలను పీవో బీవీ రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా క్రీడలను నిర్వహించుకొలేకపోయామని, ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడాలని అన్నారు. క్రీడల వల్ల ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా ఉంటారని పేర్కొన్నారు. కేటీకే 1అండ్ 6వ గనుల గ్రూప్ జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా, కేటీకే ఓసీపీ గ్రూప్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు విజయప్రసాద్, రవీందర్, అజ్మీరా తుకారాం, టీబీజీకేఎస్ నాయకులు కొక్కుల తిరుపతి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.