భూపాలపల్లి : అటవీశాఖ భూముల్లో కాస్తుకున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పోడు భూములకు ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాల పంపిణీ కోసం రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. గ్రామంలో పోడుభూములున్న రైతులతో మాట్లాడారు.
అటవీ భూముల్లో కాస్తులో ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలతో విచారణ జరిపి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో జేసీ స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సర్పంచ్ లు జేసీ స్వర్ణలతను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిల్, గ్రామ సర్పంచ్ మొండయ్య, ఎంపీటీసీ పరిపాటి మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి, గ్రామ కార్యదర్శి కవిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.